6 ఏళ్ల వేట సక్సెస్.. పట్టుబడ్డ రోలెక్స్
రోలెక్స్ పట్టుబడ్డాడు. ఏళ్ల తరబడి సాగిస్తున్న వేట ఎట్టకేలకు సక్సెస్ అయింది. కోయంబత్తూరు జిల్లా, పశ్చిమ కనుమలల్లోని ఇచికుల్లీ గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో రోలెక్స్‌ని ట్రాంక్విలైజర్‌తో అదుపులోకి తెచ్చి.. ఆ తర్వాత లారీలో మధుమలై ఎలిఫెంట్ క్యాంప్‌కి తరలించారు. రోలెక్స్‌ని అదుపులోకి తీసుకురావడానికి కుంకీ ఏనుగుల సాయం తీసుకున్నట్లు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ వేంకటేశ్ చెప్పారు. అయితే 20 ఏళ్ల రోలెక్స్.. తన కుటుంబంతో కలిసి అడవుల్లో పశ్చిమ కనుమల్లో ప్రశాంతంగా ఉండేదని.. అయితే.. కొన్నేళ్ల క్రితం వయనాడ్‌లో కొంతమంది దుర్మార్గులు పెట్టిన పైనాపిల్ బాంబు తినడంతో రోలెక్స్ నోటికి పెద్ద గాయమైంది. అప్పటి నుంచి కుటుంబానికి దూరం కావడమే కాకుండా.. రెచ్చిపోయి మనుషులపై దాడులు చేయడం మొదలుపెట్టింది. ఆగస్టు చివర్లో రోలెక్స్, కోయంబత్తూరు మారుతమల్లై అటవీప్రాంతంలో ఒక రైతు కార్మికుడిని తొక్కి చంపింది. దాంతో గ్రామస్తులంతా కలిసి ఎలాగైనా రోలెక్స్‌ని పట్టుకోవాలంటూ జిల్లా కలెక్టర్‌ని డిమాండ్ చేశారు. దీంతో అటవీ అధికారులు రోలెక్స్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వెటర్ననీ డాక్టర్‌ను గాయపరిచిన రోలెక్స్ పారిపోయింది. ఆ తర్వాత ఈ నెల 9న మళ్లీ ఆపరేషన్ మొదలుపెట్టి.. డ్రోన్‌ల సాయంతో రోలెక్స్ లొకేషన్ కనిపెట్టడమే కాకుండా.. నాలుగు కుంకీ ఏనుగుల హెల్ప్‌తో చుట్టముట్టి అతి కష్టం మీద అదుపులోకి తెచ్చారు. దీంతో గ్రామస్థులు సంబరాలు చేసుకుంటున్నారు.