కేజ్రీవాల్ ఇంటి వీడియో షేర్ చేసిన బీజేపీ
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వీడియోని బీజేపీ విడుదల చేసింది. అప్పటి నుంచి రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. కామన్ మ్యాన్ అని చెప్పుకుని తిరిగే కేజ్రీవాల్ ఇంత లగ్జరీగా ఇల్లు కట్టుకున్నాడని ఆరోపించింది బీజేపీ. ప్రజల సొమ్ముని కాజేసి కేజ్రీవాల్ ఇంత గొప్ప బంగ్లా కట్టుకున్నారని ప్రచారం చేస్తోంది. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు. గతంలో కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు ఈ బంగ్లాని వినియోగించారని, ఇదో అద్దాల మేడ అని చెబుతూ ఈ పోస్ట్ పెట్టారు. ఈ బంగ్లా సెవెన్ స్టార్ హోటల్‌ని తలపిస్తోందని చెప్పారు. మార్బుల్ గ్రానైట్ లైటింగ్ కోసం కోటి 90 లక్షలు, సివిల్ పనుల కోసం కోటిన్నరతో పాటు జిమ్ కోసం 35 లక్షలు ఖర్చు చేశారని ఈ లెక్కలన్నీ ట్విటర్‌లో పోస్ట్ చేశారు సచ్‌దేవ. ప్రభుత్వం నుంచి కనీసం కారు కూడా తీసుకోలేదని ప్రచారం చేసుకుంటున్న కేజ్రీవాల్...లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన సొమ్ముతో ఇంత పెద్ద బంగ్లా కట్టుకున్నారని ఆరోపిస్తోంది బీజేపీ. అయితే..ఈ ఆరోపణల్ని ఆప్ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ నిరాధారమేనని తేల్చి చెప్పింది.