CM Jagan : ఢిల్లీలో సిఎం జగన్ రెండవరోజు పర్యటన..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిల్లీ పర్యటన రెండోరోజూ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం సుమారు గంటపాటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రం మీదుగా వెళ్లేలా పలు జాతీయ రహదారులను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ పోర్టు నుంచి రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకు జాతీయ రహదారి డీపీఆర్ తయారీ అంశంపై చర్చించారు. నగరానికి ఈ రహదారి చాలా ఉపయుక్తమని... ఒడిశా, ఛత్తీస్ గఢ్ వెళ్లే సరకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందన్నారు. భోగాపురంలో రాబోయే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు, ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి ఈ రోడ్డు నిర్మాణం దోహదపడుతుందని గడ్కరీకి జగన్ వివరించారు. విశాఖలో వాహనరద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 లేన్ల రహదారిని కోరారు. విజయవాడ తూర్పు బైపాస్‌పై గతంలో చేసిన విజ్ఞప్తిని వీలైనంత త్వరగా పరిశీలించాలని కోరారు. సంబంధిత శాఖల సమన్వయంతో భూ సేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని వివరించారు.