ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
మీకెప్పుడైనా గుడికెళ్లాలి అనుకుంటే.. ఏ శివుడి గుడికో, రాముడి గుడికో, కృష్ణుడి గుడికో, అమ్మవారి ఆలయానికో వెళ్తారు. కానీ.. ఎప్పుడైనా ఏలియెన్ ఆలయానికి వెళ్లారా? సాధారణంగా గర్భగుడిలో ఏ శివలింగమో, రాముడి విగ్రహమో, కృష్ణుడి ప్రతిమో.. ఉంటుంది. కానీ.. గర్భగుడిలో ఏలియెన్ ప్రతిమకి పూజలు జరిగే ఆలయం కూడా ఒకటుందంటే నమ్ముతారా? వినకపోతే పదండి ఈ రోజు మిస్టరీ టూ హిస్టరీలో అలాంటి ఆలయం గురించే తెలుసుకుందాం.
తమిళనాడులోని సేలం జిల్లా లోని మల్లమూపం బట్టి గ్రామంలో ఓ ఆలయం ఉంది. ఈ ఆలయం వల్లే ఆ గ్రామం మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఆ ఆలయంలో హిందూ దేవీ దేవతలు కాదు.. ఓ ఏలియన్‌కి పూజలు జరుగుతుంటాయి. లోగనాథన్ అలియాజ్ సిద్ధర్ భాగ్య అనే ఓ ఆధ్యాత్మిక గురువు నిర్మించిన ఆలయం ఇది. ఈ ఆలయం ఎందుకు నిర్మించావు? అంటే ఆయన చాలా విచిత్రమైన సమాధానాలు చెబుతుంటాడు.
దేవుళ్లందరిలో అత్యంత శక్తివంతుడైన శివుడిని ఏలియన్లే భూమ్మీదకి పంపించారంటాడు లోగనాథన్. అంతేకాకుండా తాను ఏలియెన్లతో మాట్లాడానని చెప్పే లోగనాథన్.. వాళ్ల అనుమతి తీసుకునే ఈ ఆలయాన్ని నిర్మించానని చెబుతున్నాడు. ముఖ్యంగా, రాబోయే ప్రకృతి వైపరీత్యాలు, ప్రపంచ విపత్తుల నుంచి మానవాళిని కాపాడగలిగే అపరిమిత శక్తి ఏలియన్లకి మాత్రమే ఉందని.. అందుకే ఆ ఏలియన్ దేవుడిని పూజించడం తప్పనిసరని అంటూనే.. అసలు ఏలియన్లని పూజిస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తాడు.
ఇక ఈ ఆలయ నిర్మాణం గురించి వింటే ఇంకా పెద్ద షాక్ తగులుతుంది. ఎందుకంటే.. ఇది సాధారణ ఆలయాల్లో గోపురంతో విశాలంగా ఉండదు. 11 అడుగుల లోతైన నేలమాళిగ అంటే అండర్‌గ్రౌండ్‌లో నిర్మించబడి ఉంటుందీ ఆలయం. లోపలికి వెళ్తే మనకి నల్లటి ఏలియన్ ప్రతిమ కనిపిస్తుంది. ఆ విగ్రహం ఎదురుగా అగస్త్యుడి విగ్రహం ఉండటం ఇంకా విచిత్రం.
ఈ ఏలియన్ల గురించి అగస్త్య మహర్షి తన గ్రంథాలలో రాశారనేది లోగనాథన్ మాట. అంటే, మన పురాణాలతో గ్రహాంతరవాసులకు లింక్ ఉందని లోగనాథన్ నమ్ముతారు. ఈ వింత ఆలయం గురించి చుట్టుపక్కల గ్రామాలకు తెలిసినప్పటి నుంచి ఈ ఏలియన్ దేవుడిని చూడటానికి వందలాది మంది భక్తులు, సందర్శకులు పెద్ద సంఖ్యలోనే ఈ ఆలయానికి వస్తున్నారు.
అయితే కొంతమంది మాత్రం.. ఈ ఆలయాన్ని జస్ట్ పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా... ఈ ఏలియన్ టెంపుల్ అనేది భక్తి, విశ్వాసం అనే అంశాలను కొత్త కోణంలోకి తీసుకెళ్లింది. సైన్స్‌కి, స్పిరిచ్యువాలిటీకి మధ్య ఉన్న లింక్‌ని ఇది ఓ కొత్త మలుపు తిప్పింది.