Yanam Fruit and Flower Show | పుష్ప అంట్లే ఫ్లవర్ అనుకుంటివా...కాదు యానాం ఫ్లవర్ | ABP Desam
రెండెడ్ల బండిని తోలుతున్న రైతు.. గుర్రపు బండిపై స్వారీ చేస్తున్న రౌతు.. ముచ్చటగా రెక్కలు విచ్చుకుని చూస్తోన్న డాల్ఫిన్‌లు.. ఇవన్నీ సహజ సిద్ధంగా పూచిన పూలతో తీర్చిదిద్దిన కళాకృతులు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాను ఆనుకుని ఉండే పుదుచ్చేరి యానాంలో మూడు రోజుల పాటు అలరించిన ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ షో ఇది..
దేశ విదేశాలనుంచి తెచ్చి అందంగా అలంకరించిన పువ్వులు.. విభిన్న రకాల జాతులకు చెందిన పండ్లు ఎన్నో యానాం ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ షోలో కనువిందు చేశాయి. పుష్ప సినిమాలో చూపించినట్లు ఎర్ర చందనం దుంగలను మోస్తున్నట్లుగా ఈ రెండెండ్ల బండినిచూడండి. మాతృప్రేమకు అద్దంపట్టేలా సహజ సిద్ధంగా ఏర్పాటు చేసిన ఆవు దూడ ప్రతిరూపం.. ఇక ఐ లవ్ యూ యానాం అంటూ గులాబీలతో అలంకరించిన లోగో ఇలా అన్నింటా ఆకట్టుకున్నాయి.
తెలుగువారి పెద్ద పండుగైన సంక్రాంతి పండుగను పురస్కరించుకుని యానాంలో 21వ ప్రజాఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది.. పుదుచ్చేరి ప్రభుత్వ ఢల్లీి అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సారధ్యంలో జరిగిన ఈకార్యక్రమానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామి, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కైలాష్ నాధన్ హాజరయ్యారు. యానాం ప్రజలే కాకుండా అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాలనుంచి కూడా భారీ స్థాయిలో ప్రజలు తరలివచ్చారు.