Nithya Menen National Best Actress | నిత్యా మీనన్ కు జాతీయ ఉత్తమనటి పురస్కారం | ABP Desam
కొంత మంది నటీనటులు ఉంటారు. వాళ్లు కేవలం తమ పరిధికే పరిమితం కారు. సినిమాలో 24 విభాగాలు ఉంటే వీలైనన్నింటిలో పని నేర్చుకోవాలని తమ ప్రతిభను నిరూపించుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. అచ్చం అలాంటి కోవకు చెందిన నటి నిత్యామీనన్. బాలనటిగా సినిమాల్లో అడుగుపెట్టిన ఈ బెంగుళూరు అమ్మాయి 36వయస్సు వచ్చేసరికి దక్షిణాది అన్ని భాషలతో పాటు హిందీలోనూ తన సత్తా ఏంటో చాటింది. కేవలం నటిగానే ఆగిపోకుండా సింగర్ గా, ప్రొడ్యూసర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా అబ్బో నిత్య అడుగుపెట్టింది అంటే ఆ ఫీల్డ్ లో తన మార్క్ కనపడాల్సిందే అన్నట్లుగా ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు ధనుష్ తో కలిసి జంటగా నటించిన తిరుచిత్రాంబళం సినిమాకు గానూ జాతీయ ఉత్తమనటిగా ఎంపికైంది నిత్యా మీనన్. కచ్ ఎక్స్ ప్రెస్ సినిమాలో నటించిన మాన్సీ పరేఖ్ తో పాటు తిరు సినిమాకు గానూ నిత్యా మీనన్ కు ఇద్దరికీ జాతీయ ఉత్తమనటి పురస్కారం దక్కింది. తెలుగులో అలామొదలైంది సినిమాతో పరిచయమైన నిత్యామీనన్ సహజనటి అని చెప్పుకోవాలి. స్టార్టింగ్ లో అందరూ జూనియర్ సౌందర్య అని పిలిచేవాళ్లు. ఆ స్థాయిలో క్యారెక్టర్ మీద తన ఇంప్రెషన్ ను క్రియేట్ చేస్తుంది. హీరోయిన్ అంటే ఇలానే ఉండాలి అనే స్టీరియో టైప్స్ ను బద్ధలు కొడుతూ మనలో దమ్ముండాలే గానీ ఎలాంటి పాత్రనైనా పోషించగలం దానికి ఫిజిక్ తో పని లేదు అని ప్రూవ్ చేసింది నిత్యామీనన్. రెండు నంది అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలను కైవసం చేసుకున్న నిత్య ఖాతాలో ఇప్పుడు జాతీయ అవార్డు కూడా వచ్చి చేరింది.