రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!
మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ ఎంపీ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. మోదీ ప్రభుత్వం ఆయనను రాజ్యసభకు పంపే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సినిమా లేదా సోషల్ సర్వీస్ కేటగిరీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను నామినేట్ చేసే అవకాశముంది. రాష్ట్రపతి కోటాలో ఆయనకు ఈ ఎంపీ పదవి ఆఫర్ చేయాలని ఎప్పటి నుంచో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే రాజ్యసభలో ఈ కోటాలో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం...రాష్ట్రపతికి 12 మంది సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేసే అధికారం ఉంటుంది. ఆర్ట్స్, లిటరేచర్‌తో పాటు సోషల్ సర్వీస్ రంగాల్లోని ప్రముఖులను ఈ కోటా కింద నామినేట్ చేస్తారు. ప్రస్తుతానికి సినిమా రంగానికి సంబంధించి బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అయితే...ఇప్పుడు మెగాస్టార్‌ని కూడా ఇదే కేటగిరీలో సెలెక్ట్ చేస్తారని సమాచారం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే...ఎన్‌డీఏ కూటమిలో జనసేన కీలకంగా ఉంది. ఇప్పటికే తన అన్నయ్య నాగబాబుకి కేబినెట్‌లో చోటు దక్కేలా రిఫర్ చేశారు పవన్. ఇప్పుడు చిరంజీవికి రాజ్యసభకి నామినేట్ అవడానికి కూడా పవన్ మంతనాలు జరుపుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా...వాళ్లు సానుకూలంగా స్పందించినట్టూ ప్రచారం నడుస్తోంది. అందుకే నాగబాబును రాజ్యసభకు పంపే విషయంలో ఆలోచించారని.. రాష్ట్ర కేబినెట్‌లోకి పంపుతున్నారని చెబుతున్నారు.