Kota Srinivasa Rao Dare and Dashing | తెలుగు సినిమా బాగుండాలనే తాపత్రయం..నటుడిగా నిరూపించుకోవాలనే ఆకలి
కోట శ్రీనివాసరావు సినిమా టైపు కష్టాలు పడిన వ్యక్తి కాదు. ఆయన సినిమాల్లోకి రాకముందే ఆర్థికంగా సెటిల్ అయిన వ్యక్తి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నత ఉద్యోగంలో ఉన్న వ్యక్తి..నాటకాలంటే ఆసక్తితో అప్పుడప్పుడూ రంగస్థలంపై తన ప్రతిభను చాటుకునే వ్యక్తి..సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకోవటమే ఆయన జీవితంలో అతిపెద్ద డెసిషన్. చెన్నై వెళ్దాం ఒకవేళ ఎవరూ కాదంటే మన ఉద్యోగం ఎలాగో ఉంది కదా మళ్లీ జాబ్ లో జాయిన్ అయిపోవచ్చు అనే ఆలోచనతోనే మదరాసు వెళ్లిన కోటా...తన ప్రతిభతో ఉన్నత స్థానాలకు ఎదిగారు. అయితే అదేం ఇలా చిటెకెలో జరగలేదు. మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ఆయన. మూడు నాలుగు సినిమాల్లోనే వందే మాతరం, ప్రతిఘటన లాంటి సబ్జెక్ట్స్ తగిలాయి. ప్రతిఘటనకు స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా వచ్చింది. కానీ కోట శ్రీనివాసరావు తీసుకున్న ఓ నిర్ణయం ఆయన్ను వివాదాల్లోకి నెట్టింది. సూపర్ స్టార్ కృష్ణ అండదండలతో వచ్చిన నా పిలుపే ప్రభంజనం, మండలాధీశుడు సినిమాల్లో అన్న NTR ను కించపరిచేలా పాత్రలు చేశారు కోట శ్రీనివాసరావు. నా పిలుపే ప్రభంజనంలో సలహాదారు అక్కుపక్షి గా, మండలాధీశుడులో అయితే భీమా రావు అంటూ ఏకంగా NTR క్యారెక్టర్ నే ప్లే చేశాడు...అన్నగారి అభిమానులకు విలన్ గా తయరయ్యారు కోట. అప్పట్లో కోటా ఎక్కడ తిరిగినా అన్నగారి అభిమానుల నుంచి ఇబ్బందులే ఎదురయ్యేవి. దీంతో తట్టుకోలేక నేరుగా NTR దగ్గరికి వెళ్లి క్షమాపణలు అడిగారట. అప్పటికే అహనా పెళ్లంట లాంటి సినిమాలు రిలీజ్ అయ్యి కోట కు మంచి పేరు రావటంతో బ్రదర్ మీరు కేవలం నటులు. మీ కర్తవ్యం మీరు చేశారు. మావాళ్లు ఇబ్బంది పెట్టి ఉంటే మనసులో పెట్టుకోకండి. ఆల్ ది బెస్ట్ అన్నారట. దాంతో జీవితంలో అతి పెద్ద వివాదం నుంచి బయటపడిన కోట ఇంకెప్పుడూ వెను తిరిగి చూసుకుందే లేదు. ఎన్నో అత్యద్భుతమైన పాత్రలను అంతకంటే అద్భుతంగా నటించి మెప్పించారు కోట శ్రీనివాసరావు. ఎందుకు NTR కి వ్యతిరేకంగా వెళ్లారు అంటే అప్పట్లో తనకు అవకాశాలు వస్తున్నా తన గురించి మాట్లాడుకునే వాళ్లు కాదని..పాజిటివ్ ఆర్ నెగటివ్ తన పాత్రల గురించి చర్చ జరగాలని..కృష్ణ గారి మనుషుల ప్రోద్భలంతో ఇష్టంగానో అయిష్టంగానో ఆ పాత్రలు చేశానని తర్వాత పశ్చాత్తాప పడ్డారు కోటా శ్రీనివాసరావు. ఎందుకో కోటకు భారీ బడ్జెట్ సినిమాలంటే అంతగా నచ్చేవి కావు. ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి లాంటి ప్రాజెక్టులను తీవ్రంగా వ్యతికేరించారు కోట శ్రీనివాసరావు. గ్రాఫిక్స్, VFX లు భారీగా పెట్టి కోట్లు ఖర్చు పెట్టేస్తే సినిమా అయిపోయిదని ఆ ఖర్చుతో 40 చిన్న సినిమాలు తీసుకోవచ్చని 400 మంది ఆర్టిస్టులకు ఉపాధి లభిస్తుందని చెప్పేవారు కోట శ్రీనివాసరావు. పరభాషా నటులను మన తెలుగు ప్రేక్షకుల మీద రుద్దుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసేవారు. తన అభిప్రాయాలను నిర్భయంగా చెప్పటంలో జంకేవారు కాదు. దీని వల్ల అనేక పర్యాయాలు వివాదాల్లో చిక్కుకున్నా..నటనపరంగా మాత్రం కోటను వేలెత్తి చూపించగలిగే వాళ్లు లేకపోవటంతో 45ఏళ్ల పాటు వెండితెరపై కోట శ్రీనివాసరావు ప్రభంజనం దిగ్విజయంగా సాగింది.