ఎన్టీఆర్‌ని స్టార్‌నీ దేవుడ్నీ చేసిన లెజెండరీ డైరెక్టర్ కేవీ రెడ్డి
ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రాజమౌళి. ఆయన తీసిన సినిమాలు సాధించిన రికార్డులు కలెక్షన్స్ అందుకోవడానికి మిగిలిన డైరెక్టర్లు పోటీ పడుతుంటారు. కలెక్షన్స్ మాటెలా ఉన్నా తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన దార్శనికుడు గా టాలీవుడ్ లో రాజమౌళి స్థానం చెక్కుచెదరనది. అయితే రాజమౌళి కే నిరంతరం స్ఫూర్తి ని ఇచ్చే దర్శకుడు మరొకరు ఉన్నారు. ఆయనే KV రెడ్డి. పూర్తి పేరు కదిరి వెంకట రెడ్డి అయినా కేవీ రెడ్డి గానే ఆయన తెలుగు తమిళ ప్రేక్షకులకు సుపరిచితులు. మాయాబజార్ సినిమా ఒక్కటి చాలు ఆయన దర్శకత్వ ప్రతిభ చాటడానికి. ఈ జనరేషన్ కు కేవీ రెడ్డి పేరు తెలియక పోయినా మాయాబజార్ , పాతాళ భైరవి సినిమాల పేరు చెబితే చాలా తెలుగు సినిమా ప్రేక్షకుడు గర్వంతో ఇవి మా తెలుగు సినిమాలు అని చెప్పుకునే పరిస్థితి. ఆ సినిమాలను తెరకెక్కించింది కేవీ రెడ్డి నే. ప్రతిష్ఠాత్మక విజయా బేనర్ లో ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు సంస్థ స్థాయిని పెంచాయి . 30 ఏళ్ల కెరీర్ లో తీసినవి 16 సినిమాలు ( అందులో రెండు బైలింగ్వల్ మూవీస్ లో భాగంగా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా తీసిన మాయాబజార్, పాతాళ భైరవి సినిమాలు ). ఈ పదహారు సినిమాల్లో 12 సూపర్ హిట్ అయ్యాయి.