Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP Desam
కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ, పద్మశ్రీ అవార్డీ డా.ఎం. మోహన్ బాబు ఇంట్లో వివాదం ముదిరింది. తండ్రీ కొడుకుల మధ్య గత కొన్నేళ్లుగా మొదలైన ఆస్తి వివాదం ఇప్పుడు పెరిగి పెద్దదై వీధికెక్కింది. పరస్పరం పోలీసులకు కంప్లైంట్ లు ఇచ్చుకుంటూ ఈ వివాదాన్ని బయటపెట్టుకున్నారు మంచు మోహన్ బాబు, ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్. ముందు మంచు మనోజ్ పై దాడి జరిగిందని నిన్న ఆయన ఆసుపత్రి కి కుంటుంకుంటూ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈరోజు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో తనపై గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో దాడి చేశారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఆయన తండ్రి మోహన్ బాబు నేరుగా రంగంలోకి దిగేశారు. తన చిన్న కుమారుడు మంచు మనోజ్, ఆయన భార్య మౌనికా రెడ్డి తో తనకు ప్రాణ హాని ఉందని...తన ఆస్తులకు రక్షణ లేదని..చిన్నకొడుకు, కోడలు, వాళ్ల మనుషుల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ రాచకొండ పోలీస్ కమీషనర్ కు లేఖ రాసేశారు మోహన్ బాబు. గత కొంత కాలంగా ఆస్తి కోసం తన కుమారుడు వేధిస్తున్నాడని...సంఘ విద్రోహశక్తులను తన ఇంటి మీదకు పురమాస్తున్నాడని ఫిర్యాదు చేసిన మోహన్ బాబు..వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు. కొడుకు ఏమో ఎవరో దాడి చేశారని చెబుతుంటే...తండ్రి ఏమో తన కొడుకే తన ఇంటి మీదకు దాడి వచ్చాడని చెప్పటంతో ఈ ఇష్యూ ఇంకెన్ని మలుపులు తీసుకోనుందో చూడాలి.