Chandrababu Naidu National Politics | మరోసారి జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కీలకం కానున్నారా.? | ABP
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ రేపు (జూన్ 5) ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి సమావేశంలో పవన్, చంద్రబాబు పాల్గొననున్నారు. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అన్నీ కలిపి 280కి పైబడి స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ 400 స్థానాలు అంటూ ప్రచార సమయంలో ఊహించినప్పటికీ బీజేపీకి దేశంలో ఆదరణ తగ్గినట్లుగా తాజా ఫలితాలను బట్టి అర్థం అవుతోంది. అందుకే ఎన్డీఏలో ఉన్న పార్టీలనే కాక, ఇతర ప్రాంతీయ పార్టీలను కూడా కూటమిలో చేర్చుకొని బలం పెంచుకోవాలని బీజేపీ అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. ఎన్డీఏకు కన్వీనర్ గా చంద్రబాబును నియమించాలని కూడా బీజేపీ పెద్దలు భావించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎన్డీఏ కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టాలని ప్రధాని.. చంద్రబాబును ఫోన్ ద్వారా కోరగా.. తాను ఆలోచించి చెబుతానని 48 గంటలు సమయం ఇవ్వాలని చంద్రబాబు కోరినట్లు వార్తలు వస్తున్నాయి.