Chandrababu in NDA Meeting | ఎన్డీయే మీటింగ్ లో చంద్రబాబే ప్రధాన ఆకర్షణ
న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీయే పార్టీ నేతల మీటింగ్ జరిగింది. అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కూటమిలో బీజేపీ తర్వాత అంత పెద్ద మొత్తంలో ఎంపీ స్థానాలు గెల్చుకున్న తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అత్యున్నత గౌరవం దక్కింది. ప్రధాని మోదీ పక్కనే చంద్రబాబు నాయుడు కోసం కుర్చీ వేశారు. మోదీ కుడివైపు అమిత్ షా కూర్చోగా ఎడమ వైపు చంద్రబాబు నాయుడు ఆయన పక్కన నితీశ్ కుమార్ కూర్చున్నారు. బీజేపీ తర్వాత పెద్ద పార్టీలుగా అవతరించిన టీడీపీ, జేడీయూ అధినేతలకు ఎన్డీయే మీటింగ్ లో ప్రధాని మోదీ సముచిత స్థానం కల్పించారు. 40ఏళ్లుగా రాజకీయాలు చేస్తూ ఎప్పుడో పాతికేళ్ల క్రితమే జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబుకు మళ్లీ చాన్నాళ్ల తర్వాత దేశరాజకీయాల్లో కీలక బాధ్యతలను కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయన్న వార్తలు వస్తున్న టైమ్ లో ప్రధాని మోదీ చంద్రబాబుపై చూపించిన ఆదరణ తెలుగు దేశం పార్టీ నేతల్లో కొత్త ఆశలను చిగురింప చేస్తోంది. ఇది తెలుగోడి రేంజ్ అంటూ ఆంధ్రా, తెలంగాణల్లోని పొలిటికల్ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఎన్డీయే మీటింగ్ లో చంద్రబాబు తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. చంద్రబాబును ఉద్దేశించి ప్రధాని మోదీ అభినందించటం, అందరూ హాయిగా నవ్వుకోవటం కనిపించాయి. ఇప్పటికే ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయగా రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. ఇప్పుడు ఎన్డీయే కూటమి సభ్యుల మద్దతుతో ఈనెల 8న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే టీడీపీ కి ఎలాంటి బాధ్యతలు అప్పగించునున్నారనే అంశంపై ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతోంది.