ABP Cvoter Exit Poll Results 2024 | లోక్ సభ ఎన్నికల్లో కాషాయం జెండా రెపరెపలాడుతోందా.?
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇప్పుడందరూ ఎగ్జిట్ పోల్స్ గురించే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది..? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి..అన్న లెక్కలపై పెద్ద చర్చే జరుగుతోంది. గతంతో పోల్చి చూస్తే ఈ సారి ఎగ్జిట్ పోల్స్‌పై ఆసక్తి రెట్టింపైంది. ABP CVoter Exit Poll 2024 లోనూ ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఇక ప్రధాన రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ లో NDA కూటమికి 21 నుంచి 25 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఏపీలో ఇండీ కూటమికి ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగింది. అక్కడ 7 నుంచి 9 స్థానాలు బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ కూడా 7 నుంచి 9 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. ఢిల్లీలో NDA కి 4-6 స్థానాలు, ఇండీ కూటమి 1-3 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో NDA 25-26 స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. ప్రతిపక్ష కూటమి ఒక్క స్థానానికే పరిమితం కానుంది. మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి 23-25 చోట్ల గెలుస్తుందని ఎగ్జిట్ పోల్ తెలిపింది. NDA కూటమికి 22-26 స్థానాలు వచ్చే అవకాశముంది. ఇక 80 ఎంపీ స్థానాలున్న యూపీలో ఇండీ కూటమి 15-17 స్థానాలు గెలుచుకుంటుందని, NDA 62-66 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.