(Source: ECI/ABP News/ABP Majha)
Air India Bid: మళ్లీ టాటా చేతికి ఎయిర్ ఇండియా.. 68 ఏళ్ల తరువాత
టాటా సన్స్ అనుకున్నది సాధించారు. ఎయిర్ ఇండియాను తిరిగి టాటా కంపెనీ సొంతం చేసుకుంది. ఇటీవల టాటా చేతిలోకి ఎయిర్ ఇండియా రానుందని ఇటీవల బ్లూమ్ బర్గ్ పేర్కొనగా.. తాజాగా అధికారికంగా నిర్ణయం వెల్లడైంది. టాటా సన్స్‌తో పాటు స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ సైతం ఎయిర్ ఇండియాను సొంతం చేసుకునేందుకు బిడ్ దాఖలు చేశారు. రూ.18 వేల కోట్లతో టాటా సన్స్ ఎయిరిండియా సొంతం చేసుకుంది. ముఖ్యంగా టాటా గ్రూప్, స్పైస్ జెట్ సహా పలు ప్రముఖ సంస్థలు బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు రూ.18 వేల కోట్ల బిడ్‌తో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. టాటా సన్స్‌కు చెందిన టలెస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.18000 కోట్లకు బిడ్ దక్కించుకుంది. డిసెంబర్ 2021 నాటికి ఇందుకు సంబంధించి నగదు బదిలీ అవుతుందని భావిస్తున్నామని డీఐపీఏఎం సెక్రటరీ తుహిన్ కాంత్ పాండే అధికారికంగా ప్రకటనలో పేర్కొన్నారు.