
YS Jagan on Pawan Kalyan Winning |పవన్ పెళ్లిళ్లపై పదే పదే విమర్శలు - వైసీపీ చేసిన తప్పుల్లో ఇదొకటి!
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు... వైసీపీ ఓటమికి కారణాలు ఏమిటని ఆలోచిస్తే ఆ పార్టీ నేతలు, ప్రభుత్వం చేసిన తప్పులు కొన్ని కనిపిస్తాయి. జనసేనాని పవన్ వ్యక్తిగత జీవితం మీద చేసిన విమర్శలు ఆ తప్పులో ప్రధానమైనది.అదే మూడు పెళ్లిళ్లు..!
జనసేన పార్టీ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి ఆయన వ్యక్తిగత జీవితం ఆయుధం అయ్యింది వైసీపీ నేతలకు. రాజకీయంగా ఆయన్ను ఎదుర్కోలేక పదేపదే పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చారు. ఛోటా మోటా నాయకులు పెళ్లిళ్లపై విమర్శలు చేశారని అనుకుంటే ఏదో అని ఊరుకోవచ్చు. ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం పదేళ్లుగా ఒక్కటే పాట పాడుతూ వచ్చారు.
ఒకానొక సమయంలో వైసీపీ విమర్శలకు పవన్ కళ్యాణ్ బదులు ఇచ్చారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకోలేదని, అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చారు. వైసీపీ తప్పుల్ని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉద్దానం సమస్య నుంచి రోడ్లు, ఇసుక, మద్యం వంటి విషయాల్లో వైసీపీ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం మొదలు పెట్టారు. అప్పుడూ పవన్ రాజకీయ జీవితం మీద కాకుండా వ్యక్తిగత జీవితంపై మాత్రమే వైసీపీ ఫోకస్ చేసింది. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ పవన్ చదువుతారని చెబుతూ వచ్చింది. తమది రొటీన్ స్క్రిప్ట్ అనే సంగతి మర్చిపోయింది. దీన్ని ప్రజలూ గమనించారు.