YS Jagan Assembly Absence | పాపం.. YSRCP ఎమ్మెల్యేలు..అధ్యక్షుడికి చెప్పలేరు... అసెంబ్లీకి వెళ్లలేరు
శాసనసభకు ఎన్నికవ్వడం ఎవరికైనా రాజకీయ పయనంలో ఓ కీలక మలుపు.. శాసనసభలో అడుగుపెట్టడం.. ఓ అనుభూతి.. అరుదైన అవకాశం..! అసెంబ్లీలో గొంతెత్తడం.. తనను ఎన్నుకున్న ప్రజల గొంతుకలకు ప్రాణం ఇవ్వడం..
కానీ.. ఇక్కడ సభకు ఎన్నికైన సభ్యులు అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదు. అధ్యక్షా... అంటూ తమ ప్రజల గోడును వినిపించడం లేదు. ఇది వారికై వారు తీసుకున్న నిర్ణయమా.. లేక రాజకీయ క్రీడలో పావులుగా మారిన వైనమా..?
Yes.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన ఆ 11మంది గురించే చెప్పేది. అసెంబ్లీలోకి అడుగుపెట్టకూడదు అన్నది ఆ 11మంది నిర్ణయమా.. లేక అందులో ఒకరి నిర్ణయానికి మిగతా 10మంది కట్టుబుడిపోయి ఉండాల్సిన పరిస్థితా.?
ప్రతిపక్ష హోదా కోసం జగన్ మంకుపట్టు..
గడచిన ఏడాదిన్నర కాలంగా ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. 2024 శాసనసభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన అప్పటి అధికార పార్టీ YSRCP కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయింది. మొత్తం 175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్సార్సీపీకి 11సీట్లు వచ్చాయి. ప్రతిపక్ష హోదా రావాలంటే.. కనీసం 18 స్థానాలు గెలుచుకోవాలి. ఇక్కడ ప్రతిపక్ష హోదా ఏంటన్న దానికి ఎవరికి వారే తమకు నచ్చిన భాష్యం చెబుతున్నారు. సరే కారణం ఏదైనా కానీ.. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డి డిమాండ్ చేయడం మాత్రమే కాదు.. అది ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని ఆయన మొండిపట్టు పట్టారు. ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పటి వరకూ నాలుగు సమావేశాలు జరిగినా.. వాటికి హాజరు కాలేదు.