గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులు
Srikakulam News: శ్రీకాకుళం జిల్లా మందస మండలం సువర్ణపురం గ్రామంలో ఎలుగుబంట్ల సంచారం భక్తులకు ఆందోళన కలిగించింది. కార్తీక మాసం సందర్భంగా గ్రామంలోని శివాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పూజలు చేసేందుకు తరలి వచ్చారు. అయితే, ఊహించని విధంగా ఒకేసారి మూడు ఎలుగుబంట్లు శివాలయం వద్ద ప్రత్యక్షం కావడంతో భక్తులు భయంతో హడలిపోయారు. ఎలుగు బంట్లు పక్కనే సంచరిస్తుండడంతో భక్తులు అప్రమత్తమై అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ పరిసర ప్రాంతంలో భయాందోళన పెరగడంతో గ్రామస్తులు ఎలుగు బంట్లను దూరం చేయాలని ప్రయత్నించారు. గ్రామస్థులు ఒక్కసారిగా వింత అరుపులు చేస్తూ, చేతుల కర్రలు తీసుకుని వాటిని వెనక్కి పంపేందుకు యత్నించారు. ఎలుగు బంట్ల రాకతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి, భక్తులు సైతం భక్తి కార్యక్రమాలు వదిలి సురక్షిత ప్రాంతాలకు చేరేలా ప్రయత్నించారు.