బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం
ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అయితే..ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు, తెలంగాణ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు శ్రీనివాస్ గౌడ్. ఇది మంచి పద్ధతి కాదని, గతంలో ఇచ్చిన ప్రియార్టీ ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ సమస్యని పరిష్కరించాలని అన్నారు. తెలంగాణలో ఎక్కువగా ఆంధ్రా వ్యాపారస్థులే లాభ పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ తమ గౌరవాన్ని కాపాడుకోవాలనీ అన్నారు. అయితే..ఈ వ్యాఖ్యలపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఘాటుగా స్పందించారు. తిరుమల ప్రశాంతతను దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. తిరుమల..రాజకీయాలకు వేదిక కాదని, ఇలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణకు చెందిన ఓ నేత చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, చర్యలకు ఆదేశించామని..శ్రీనివాస్ గౌడ్ పేరు ప్రస్తావించకుండానే తేల్చిచెప్పారు.