Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP Desam
దేవుని స్మరించుకోవడం ప్రశాంతత.. దండం పెట్టుకోవడం ఆధ్యాత్మికత.. దర్శించుకోవడం భక్తి... ఇవన్నీ కలిస్తేనే ముక్తి. కానీ ఫలానా సమయంలో ఫలానా చోట దర్శించుకోవడమే ముక్తి.. అప్పుడే పాపాల నుంచి విముక్తి అని అనుకోవడం.. చెప్పడమే తప్పు. ఈ వెర్రితనం పెరిగి ప్రాణాలు పోయేవరకూ వస్తోంది. బుధవారం రాత్రి తిరుపతిలో జరిగింది అదే. కొన్ని దశాబ్దాలుగా తిరుపతిలో తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి లేదు. దేశంలోనే అత్యున్నతమైన ఆలయ నిర్వహణ వ్యవస్థ టీడీడీ నడుపుతోంది. అలాంటి చోట కూడా ఈ ప్రమాదం జరిగిందంటే ఈ భక్తి-ముక్తి వ్యామోహం ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
ముక్కోటి నాడు దేవాలయాలకు వెళ్లడం హిందూ సాంప్రదాయంలో ఎప్పుటి నుంచో ఉన్నదే. ముఖ్యంగా వైష్ణవాలయాల్లో భక్తుల రద్దీ ఉంటుంది. దక్షిణాయనం మొత్తం నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు నిద్రలేచే సమయం ఇది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటే పుణ్యం అని భక్తుల విశ్వాసం. అయితే భక్తి భక్తిలా ఉన్నంతవరకూ పర్వాలేదు..కానీ అది పిచ్చిలా మారితేనే తిరుపతిలాంటి ఘటనలు జరుగుతాయి.
వైకుంఠ ఏకాదశి నాడే వెళ్లాలి. ఉత్తర ద్వారంలోనే దర్శనం చేసుకోవాలి. ఏం ఇలా చేసుకుంటేనే పాపాలు పోయి సరాసరి వైకుంఠానికి వెళతామా.. లేకపోతే మనకి ముక్తి రాదా..? అసలు ఇలా దర్శనం చేసుకోవాలి ఫలానా చోటనే చేసుకోవాలని ఎక్కడైనా గ్రంథాల్లో ఉందా..? భక్తులను కరుణించే వాడు భగంవతుడు అయితే ఏరోజైనా.. మనస్ఫూర్తిగా శ్రద్ధగా పూజిస్తే. అనుగ్రహిస్తాడు. ఫలానా రోజకి ప్రాముఖ్యత ఉంది అనుకోవడం తప్పుకాదు. ఆ రోజు దర్శనానికి వెళ్లడమూ తప్పుకాదు. దేవుడు సర్వాంతర్యామి.. అంటారు కదా... ఆయన నివాసం ఉండే ఏ గుడైనా అంతే పవిత్రం కదా.. మరి మన ఊరిలో ఉన్న.. దగ్గరలో ఉన్న గుడికి వెళ్లకుండా ఎక్కడికో వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకు..? (హైందవ ప్రచారం చేస్తున్న పెద్దల మాట కూడా జనం చెవికెక్కించుకోవడం లేదు. మనందరికీ ప్రవచనాలు చెప్పే ఈ పెద్దాయన ఏం చెప్పారో ఓసారి వినండి..)