Tirupati Pilgrims Stampede 4died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP Desam
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల పంపిణీలో ఘోర ఘటనలు చోటుచేసుకున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో టోకెన్ల కోసం క్యూలైన్ల వద్ద చేరుకోవడంతో తోపులాటలు కలగజేసాయి. ఈ సంఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శ్రీనివాసం వద్ద టోకెన్లు జారీ చేస్తున్న సమయంలో సేలంకు చెందిన ఒక మహిళ తొక్కిసలాటలో మరణించిందని అధికారులు వెల్లడించారు.
బైరాగిపట్టెడ వద్ద జరిగిన మరో తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా, వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉందనేది ఇంకా తెలియరాలేదు.
టీటీడీ అధికారులు వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు నగరంలోని పలు కేంద్రాల్లో ఆఫ్‌లైన్‌లో జారీ చేయనున్నట్లు ప్రకటించడంతో, భక్తులు ముందుగానే కౌంటర్ల వద్దకు చేరుకున్నారు. రేపు ఉదయం నుంచి పంపిణీ మొదలుకానున్నప్పటికీ, మధ్యాహ్నం నుంచే క్యూలైన్లలోకి భక్తులు పెద్ద ఎత్తున రావడం తోపులాటలకు దారితీసింది.
ఈ దుర్ఘటనల వల్ల భక్తులు మిగిలిన భద్రతా ఏర్పాట్లపై ఆందోళన చెందుతున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్న సమయంలో తగిన ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటనలు జరిగాయని పలువురు విమర్శిస్తున్నారు. అధికారులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని భక్తుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.