Tirupati Gangamma Jathara Pushpa 2 Getup | తిరుపతి గంగమ్మ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా మాతంగి వేషం | ABP
తిరుపతి గంగమ్మ జాతర అంటేనే రాయలసీమలో ఓ ప్రత్యేకత. సీమలోనే అతిపెద్ద జాతరగా చెబుతారు దీన్ని. తిరుమల శ్రీవారికి చెల్లెలుగా పూజలు అందుకునే తాతయ్యగుంట గంగమ్మ జాతరలో రకరకాల వేషాలు వేసి అమ్మవారికి భక్తులు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అమ్మవారి జాతరలో విలక్షణంగా కనిపించే వేషం మాతంగి వేషం. ఆరోజు పురుషులు అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు ఆడవేషం వేసుకుని గుడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.మాతంగి వేషం వేసుకోవటానికి ఒక్కొక్కరికి సుమారుగా రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. అచ్చం మహిళల్లా మారిపోతుంటారు పురుషులు. చీరకట్టు, నగలు ధరించటం, మేకప్ అచ్చం అంతా ఆడవాళ్లలానే మస్తాబువుతారు అబ్బాయిలు. ఐకాన్ అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఈ వేషానికి దేశవ్యాప్తంగా ప్రాధాన్యత వచ్చింది. పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ మాతంగి వేషంలో కనిపించటంతో ఇదే వేషమంటూ ఫిలిం సర్కిల్స్ నుంచి అందరి వరకూ ఒకటే చర్చ నడిచింది. తిరుపతి గంగమ్మతల్లికి మొక్కుగా చెల్లించుకునే మాతంగి వేషమని అల్లు అర్జున్ అభిమానులకే కాదు ఉత్తర, దక్షిణభారతాల్లో చాలా మందికి ఈ వేషం గురించి, గంగమ్మ జాతర గురించి వివరాలు తెలిశాయి. అందుకే ఇప్పుడు తిరుపతిలో గంగమ్మజాతర జరుగుతుంటే ఈ పుష్ప 2 మాతంగి వేషం కూడా ట్రెండింగ్ గా కనిపిస్తోంది. ముఖానికి నీలం, ఎరుపు రంగులు పూసుకుని బన్నీ అభిమానులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.