అమ్మో! ఇళ్ల పక్కనే పెద్దపులి! గజగజ వణికిపోతున్న జనం

గ్రామంలో ఇళ్లకి దగ్గర్లోనే పులి ఎలా తిరుగుతుందో చూశారా? ఏపీ ఒడిశా బార్డర్‌లో పులి సంచారం చేస్తుండడంతో ఆంధ్రాలో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. గత కొన్ని రోజులుగా ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాల్లో మహారాష్ట్ర నుంచి దారితప్పి వచ్చిన పులిని అక్కడ అటవి అధికారులు గుర్తించారు. దీంతో బరంపురం సమీపాన జయంతి పురం వాసులు పులిని చూడడంతో ఆ ప్రాంతంలో భయం వెంటాడుతోంది. అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పైగా పొలాల్లో పులి పాద గుర్తుల్ని  అటవీ సిబ్బంది గుర్తించారు. దీంతో భలియాగడ, పల్లి, ఝింకిపదర్, ఘాటీకాళువ తదితర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ సిబ్బంది ఆయా గ్రామాల్లో మైకు ద్వారా ప్రచారం నిర్వహించి, ప్రజల్ని చైతన్యపరిచారు. పశువుల్ని మేతకు బయటకు వదలొద్దని, ప్రజలు సాయంత్రం నుంచి తెల్లవారే వరకు ఇళ్ల నుంచి బయటకు ఒంటరిగా రావద్దని వారు ప్రచారం చేశారు. పులి సంచారం నేపథ్యంలో  శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సరిహద్దు వాసులను పలాస కాశీబుగ్గ రెంజ్ ఆఫీసరు మురళీ కృష్ణ అప్రమత్తం చేశారు. ఒడిశా బరంపురం ప్రాంతంలో పులి సంచరిస్తున్నందున శ్రీకాకుళం జిల్లా వైపు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. గట్టి నిఘా పెట్టామని, ప్రజలకు  అప్రమత్తం చేశామని మురళి కృష్ణ చెబుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola