Titli Cyclone Problems: ఇద్దరు సీఎంలవీ మాటలే తప్ప చేతల్లేవంటున్న తిత్లీ బాధితులు
అది 2018 అక్టోబర్ 10... తిత్లీ తుపాను దెబ్బకు సిక్కోలు జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. ఉద్దానం ప్రాంతంలో పంటలను, రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. 18 మండలాల్లో కోట్ల రూపాయల నష్టంతో పాటు, వందల కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసేసింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడే ఉండి విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలు త్వరగా పునరుద్ధరించేలా అధికారులను పరుగులు పెట్టించారు. తుపాను బీభత్సానికి సర్వం కోల్పోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఆ హామీ కాగితాలకే పరిమితమైంది. ఇంతలో ప్రభుత్వం మారింది. జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం కొలువుతీరింది. తుపాను బాధితులకు తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని 2022 అక్టోబర్ ఒకటిన ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కానీ అది కూడా ఇప్పటికీ అమలుకాలేదని బాధితులు తమ బాధను వెళ్లగక్కుతున్నారు. నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని చెప్పి, అధికారంలోకి వచ్చాక తమను గాలికొదిలేశారని, ఏడాదిన్నర క్రితం జగన్ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు ఇప్పటికీ అలానే ఉన్నాయని చెబుతున్నారు.