Mangli Ram Mohan Naidu Issue | కేంద్రమంత్రి రామ్మోహన్ పై మండిపడుతున్న టీడీపీ కార్యకర్తలు | ABP Desam

 కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఓ అక్కర్లేని వివాదంలో ఇరుక్కున్నారు. రథసప్తమి రోజు శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో సూర్యనారాయణుడి దేవస్థానంలో నిర్వహించిన పూజల్లో రామ్మోహన్ నాయుడు తో పాటు సింగర్ మంగ్లీ పాల్గొనటం ఇప్పుడు వివాదానికి  కారణమవుతోంది. తన కుటుంబంతో సూర్యుదేవుడి పూజల్లో పాల్గొన్న రామ్మోహన్ నాయుడితో పాటు మంగ్లీ కూడా ఉన్నారు. బ్రేక్ దర్శనంలో వీఐపీలా పాల్గొన్నారు. అక్కడితో ఆగకుండా తన అన్న లాంటి రామ్మోహన్ నాయుడు మంచిగా దేవుడి దర్శనం చేయించారని...సూర్య భగవానుడి గురించి పాటలు పాడే అవకాశం ఇచ్చారంటూ చెప్పారు మంగ్లీ... ఇప్పుడు ఇదే టీడీపీ కార్యకర్తల ఒళ్లు మండిపోయేలా చేస్తోంది.

 తనదైన శైలిలో జానపద, ఆధ్యాత్మిక గీతాలతో మంగ్లీగా ఫేమస్ అయిన సత్యవతి వైఎస్ జగన్ కు వీరాభిమాని. ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో స్వయంగా ప్రకటించుకున్నారు. వైసీపీ కోసం అనేక పాటలు పాడారు. పోనీ సింగర్ గా తన ప్రొఫెషన్ అది అనుకోవటానికి లేదు. జగన్ ను గెలిపించాలని గత ఎన్నికల్లో స్వయంగా జగన్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు ఆమె. వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ కోసం ఆమె చేస్తున్న సేవలకు ఎస్వీబీసీ బోర్డులో మెంబర్ కూడా అవకాశం ఇచ్చారు వైఎస్ జగన్. పైగా ఓ సందర్భంలో తను పాపులారిటీలో ఉన్నప్పుడు చంద్రబాబు గురించి ఓ పాటపాడాలని టీడీపీ నుంచి రిక్వెస్ట్ వెళ్లగా...చంద్రబాబు పాటలు తను పాడనని చెప్పినట్లు కూడా చెబుతారు. అలా వైసీపీ కి హార్డ్ కోర్ మనిషిలా తిరిగిన మంగ్లీకి ఇప్పుడు కేంద్ర మంత్రి హోదాలో ఉన్న రామ్మోహన్ నాయుడు వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వటం ఏంటంటూ సగటు టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా మంగ్లీ పాత వీడియోలను పోస్ట్ చేస్తూ రామూ చేసింది తప్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరుడుగట్టిన టీడీపీ మనిషైన ఎర్రన్నాయుడి కొడుకు పార్టీకి ఉత్తరాంధ్రలో కొండంత అండలా ఉండాల్సిన రామ్మోహన్ నాయుడు ఇలా వైసీపీ మనుషులకు వైసీపీ ట్రీట్మెంట్ ఇవ్వటం అంటే ఇన్నాళ్లూ కష్టాల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలను అవమానించటమేనంటూ ట్వీట్లు మీద ట్వీట్లు పెడుతూ ఫైర్ అయిపోతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola