Pulicherla Muslims Constructing Temple | మతసామరస్యానికి నిదర్శనం ముస్లింలు కడుతున్న ఈ హిందూ దేవాలయం
భారత దేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం..మతసామరస్యానికి పుట్టినిట్లు ఇలాంటివి మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాటలే. కానీ ఆ మాటలను నిజం చేసి చూపిస్తోంది చిత్తూరు జిల్లా పులిచర్ల మండలంలోని ఓ ముస్లిం కుటుంబం. ఎందుకంటే వీళ్లు ఓ హిందూ దేవాలయ సముదాయాన్ని నిర్మించటానికి సంకల్పించుకున్నారు కాబట్టి. పులిచర్ల మండలం కే కొత్త పేటకు చెందిన గూడుషాబ్ ఓ హిందూ దేవాలయాల సముదాయాన్ని నిర్మించాలని సంకల్పించుకున్నారు. దీనికి ఓ కారణం ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం గూడుషాబ్ కు పిల్లలు పుట్టకపోవడంతో ఆంజనేయ స్వామిని మొక్కుకున్నారట. అప్పుడు ఓ మగ బిడ్డ జన్మించాడు. అతని పేరు అజీజ్ బాషా గా పెట్టి చిన్నతనం నుండి ఆంజనేయ భక్తుడిగా మార్చారు. ఆ అజీజ్ బాషా పెరిగి పెద్దైన తర్వాత ఓ హిందూ దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. తనకు పుట్టిన ఇద్దరు కుమారులతో కలిసి వినాయకుడు, సాయిబాబా విగ్రహ ప్రతిష్ట చేశారు. నవగ్రహాలు, ఆంజనేయ స్వామి, వేంకటేశ్వర స్వామి, శివుడు, గంగమ్మలతో కూడిన సప్త మందిర సముదాయం నిర్మాణం చేయాలనేది సంకల్పం. కానీ విధి ఆయన కోరిక తీరకుండానే తీసుకువెళ్లిపోయింది. ఎంతెలా అంటే హిందూ దేవాలయ నిర్మాణానికి తన మతంలో ఉన్న వారు వ్యతిరేకించారు. ఓ రకంగా వెలివేశారు. ఆఖరుకు అజీజ్ బాషా చనిపోతే ఖననం చేయటానికి ఒప్పుకోలేదంట మతపెద్దలు. దీంతో ఆయన కొడుకులు తిరుపతికి తీసుకువచ్చి అక్కడ దహన సంస్కారాలు చేశారు. తమ తండ్రి ఆశయాన్ని భుజాలకెత్తుకున్నారు. తమ తండ్రి ఆఖరి కోరిక అయిన సప్తమందిర నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతామంటున్నారు అజీజ్ బాషా తనయులు షేక్ ఫిరోజ్ బాషా, షేక్ చాంద్ బాషా.