Pilgrims Rush in Tirumala | తిరుమలలో విపరీతంగా పెరిగిన భక్తుల రద్దీ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమలలో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుందని తెలుస్తోంది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద బుధవారం సాయంత్రం నుంచి భక్తులు వేచి ఉన్నారు. తాగునీరు సైతం లేకుండా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భజరంగ దళ్ ఆధ్వర్యంలో తాగునీరు పంపిణీ చేశారు.
స్వామివారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తిరుమలకు వస్తున్న భక్తులకు అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నారు. ఇందులో భాగంగా శిలాతోరణం, బాట గంగమ్మ గుడి, మార్గలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తుల సౌకర్యార్థం 27 ప్రాంతాల్లో తాగునీరు, 4 ప్రాంతల్లో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. తిరుమలకు విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం అక్టోపస్ భవనం నుంచి శిలాతోరణం వరకు 8 బస్సులు ఏర్పాటు చేసి ప్రతి నిమిషానికి భక్తులను చేరవేసేలా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. తిరుమల క్యూ లైన్లలో తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహించి చర్యలు తీసుకున్నారు.