Pawan Kalyan about Sugali Preethi Case | సుగాలి ప్రీతి కేసుపై స్పందించిన పవన్ కళ్యాణ్
జనసేన పోరాటం ఫలితంగానే సుగాలి ప్రీతి కుటుంబానికి కొంత వరకైనా న్యాయం జరిగిందని జనసేన అధినేత, ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి పేరుతో రాజకీయం చేసి ఇప్పుడు స్పందించడం లేదంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సుగాలి ప్రీతి తల్లి మీడియాతో మాట్లాడు జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేస్తానంటూ ప్రకటించడం మరింత సంచలనంగా మారింది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న పవన్ కల్యాణ్ జనసేనానీతో జనసేన కార్యక్రమంలో ఈ విషయంపై మాట్లాడారు.
సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో నా పరిస్థితి పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న చందంగా తయారయ్యింది. చేయూతనిచ్చిన వారినే తిడితే ఎలా? గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఎదురు మాట్లాడే ధైర్యం కూడా ఎవరికీ లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తే కనీసం రోడ్ల మీదకు రావడానికి ఎవరూ సాహసించని పరిస్థితి. అలాంటి సమయంలో ఆ తల్లి ఆవేదన చూసి లక్షల మందితో కర్నూలు నడిబొడ్డుకు వెళ్లి బలంగా గళం వినిపించాను. ఆ పోరాట ఫలితంగా ఆ కేసును సి.బి.ఐ.కి అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. చట్టప్రకారం వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాలు అందాయి. కర్నూలుకు 9 కిలోమీటర్ల దూరంలో దిన్నెదేవరపాడులో అయిదు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. అక్కడ ఎకరం విలువ సుమారు రూ.2 కోట్ల వరకూ మార్కెట్ విలువ ఉంటుందని అంటున్నారు. కర్నూలు నగరంలో భాగమైన కల్లూరు దగ్గర 5 సెంట్ల ఇండ్ల స్థలం, సుగాలీ ప్రీతి తండ్రికి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. రాజకీయపరంగా మనం తీసుకువచ్చిన ఒత్తిడి ఫలితమే ఇది అని అన్నారు పవన్ కళ్యాణ్.