అందరూ నిద్రలో ఉండగా అగ్ని ప్రమాదం, తప్పిన ప్రాణ నష్టం
ప్రకాశం జిల్లాలో ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైన ఘటన సంచలనంగా మారింది. హైదరాబాద్ నుంచి చీరాల వచ్చే ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్థమైంది. పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ఈ ఘటన జరిగింది. అయితే ప్రయాణికులంతా బస్సులో నుంచి వెంటనే కిందకు దిగడంతో ప్రాణనష్టం తప్పింది. ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి చీరాలకు వస్తోంది. తెల్లవారుజామున తిమ్మరాజుపాలెం వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే ఈ విషయాన్ని గ్రహించిన డ్రైవర్ తాను బయటకు దిగేస్తూ ప్రయాణికుల్ని అప్రమత్తం చేశాడు. దీంతో అంతా బస్సులోని నుంచి దూకి ప్రాణాలకు కాపాడుకున్నారు. మంటలు బస్సు మొత్తం అంటుకుని అగ్నికి ఆహుతయింది.