Nellore Rains Update: నెల్లూరు-చెన్నై రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర బారులు
నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డు రవాణా వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. వాహనదారులకు నరకం చూపెడుతోంది. జాతీయ రహదారులపై సైతం నీరు తిష్టవేయడంతో ప్రయాణం నరకంగా మారుతోంది. ముఖ్యంగా నెల్లూరు-చెన్నై రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర బారులుతీరి కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద లారీలు సైతం నీటమునగడంతో ఇటువైపుగా వెళ్లాలంటేనే వాహనదారులు భయపడిపోతున్నారు. వారం రోజుల క్రితం నెల్లూరునుంచి వెళ్లే 16వనెంబర్ జాతీయ రహదారికి గండిపడింది. పెన్నా వరదకు హైవే సైతం కోసుకుపోయింది. రిపేర్ చేసేందుకు 24గంటల సమయం పట్టింది. యుద్ధప్రాతిపదికన పనులు జరిగినా.. ఒకరోజంతా ప్రయాణికులు నరకం చూశారు. మరో మార్గంలేక, ఒకవేళ వేరే రూట్లో వెళ్లినా సమయం మరింత ఎక్కువవుతుందనే భయంతో చాలామంది రోడ్లపైనే పడిగాపులు పడ్డారు. గతంలో కురిసిన వర్షాలకు రైల్వే ట్రాక్ లు కూడా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.