Nellore: ప్రమాణస్వీకారం వేళ ఆసక్తికరంగా నెల్లూరు కార్పొరేషన్ మేయర్ భర్త వ్యాఖ్యలు..!
నెల్లూరు నగర కార్పొరేషన్ లో కొత్త పాలకమండలి కొలువుదీరింది. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ గా పొట్లూరి స్రవంతి ప్రమాణ స్వీకారం చేశారు. రూప్ కుమార్ యాదవ్, మహ్మద్ ఖలీల్ అహ్మద్ డిప్యూటీ మేయర్లుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కార్పొరేషన్ సాధారణ ఎన్నికలలో గెలుపొందిన 54 మంది అభ్యర్థులు పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్ స్రవంతి భర్త వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు జయవర్ధన్ వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. గిరిజనులకు మేయర్ పదవి వస్తే, వారు రబ్బస్ స్టాంపుల్లాగా పనిచేస్తారని, పెద్ద నాయకుల చెప్పుచేతల్లో ఉంటారని కొంతమంది కామెంట్ చేస్తున్నారని, అలాంటి వారందరికీ ఇదే నా జవాబు అన్నారు జయవర్దన్. గిరిజన బిడ్డలుగా తాము పులులతో స్నేహం చేస్తామని తేడా వస్తే అదే పులులతో పోరాటం కూడా చేస్తామని చెప్పారు.