Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
వైసీపీ నేతలు నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలపై ఆంధ్ర ప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ విమర్శలు గుప్పించారు. అవి ఆత్మీయ సమావేశాలు కాదని, ప్రజల తిరస్కారం మరియు రాజకీయ భవిష్యత్తుపై భయంతో నిర్వహిస్తున్న ఆత్మావలోకన సమావేశాలని ఎద్దేవా చేసారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని, విదేశీ విద్య పథకాలను నిలిపివేసి కాపు యువత భవిష్యత్తుతో చెలగాటమాడారని మంత్రి ఆరోపించారు. అలాంటి నాయకులకు ఇప్పుడు కాపు సమాజం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని జనసేన నేతలు విమర్శించారు.
ప్రజల ఆశీర్వాదంతోనే పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక విజయం సాధించారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. "దేశం, సమాజం బాగుండాలి... నన్ను కులాల చట్రంలో బంధించవద్దు" అనే పవన్ కళ్యాణ్ భావజాలాన్ని వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కుల రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టే రోజులు ముగిశాయని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించారు.