బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉత్తరాంధ్రలో దంచి కొడుతున్న వానలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్లపై పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోతున్నాయి. స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తమై ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని ప్రతి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అధికారులంతా కచ్చితంగా అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి, బహుద నదులు ఉగ్రరూపందాల్చే ప్రమాదముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తచర్యలు చేపడుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో వీఆర్‌వో, రెవెన్యూ సిబ్బంది అందుబాటులోకి వస్తోంది. NDRF సిబ్బంది కూడా జిల్లాకి చేరుకుంది. అధికారులకు సమాచారం అందించిన తరవాతే వినాయక నిమజ్జనం చేపట్టాలని అధికారులు స్పష్టం చేశారు. చెరువులు పొంగి పొర్లుతుండడం వల్ల సమాచారం లేకుండా వెళ్లొద్దని తేల్చి చెప్పారు.