Eluru Collector Vetriselvi on Bird Flu | కోళ్ల నుంచి బర్డ్ ఫ్లూ మనిషికి వచ్చిందా.? | ABP Desam

జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందని అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, సరైన నిర్దారణ లేకుండా అసత్య ప్రచారాలతో ప్రజల్లో అలజడి సృష్టించవద్దని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలియజేశారు. గురువారం స్ధానిక కలెక్టరేట్ లో బర్డ్ ఫ్లూ సంబంధిత అంశంపై జిల్లాలో తీసుకున్న చర్యలను కలెక్టర్ పాత్రికేయులకు వివరించారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఉంగుటూరు మండలం బాదంపూడిలో ఒక ఫౌల్ట్రీలో కోళ్లు చనిపోతున్నాయని ఫిర్యాదు అందగానే పశుసంవర్ధకశాఖ అధికారులను అప్రమత్తం చేసి మృతిచెందిన కోళ్ల నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపడం జరిగిందన్నారు.  వాటిని వ్యాధి నిర్ధారణకోసం భోపాల్ లో ఉన్న నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కు పంపడం జరిగిందని, పిమ్మట బుధవారం సాయంత్రం సంబంధిత నివేదిక రావడం జరిగిందన్నారు.  అందులో బర్డ్ ఫ్లూ పాజిటీవ్ గా నిర్ధారణ అయిందన్నారు.  ఆ మేరకు వెంటనే ఎస్ఓపిని అమలు చేయడం లో భాగంగా జిల్లాలోని అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించి అప్రమత్తం చేశామన్నారు.  ఎక్కడైనా పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతూ ఉంటే వెంటనే పశు సంవర్ధక శాఖ అధికారులకు తెలియచేయాలంటూ 9966779943  టోల్ ఫ్రీ నెంబర్ తో కూడిన 24/7 కమాండ్ కంట్రోల్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేశామన్నారు. ఏదైతే బాదంపూడి లోని పౌల్ట్రీ ఫారంలో కోళ్లల్లో బర్డ్ ప్లూ నిర్ధారణ అయిందో అక్కడి నుంచి కిలో మీటరు మేర ఇన్ఫెక్టెడ్ జోన్ గా పరిగణించడం జరిగిందన్నారు.  10 కిలోమీటర్ల వరకు సర్వేలైన్స్ జోన్ గా పరిగణించడమైనదన్నారు. ఇన్ఫెక్టెడ్ జోన్ లో ఉన్న కోళ్లఫారంలోని కోళ్లను పూర్తిగా కల్లింగ్ చేసి ఖననం చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు.  కల్లింగ్ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాటు చేశామన్నారు. ఒకొక్క టీం లో 5గురు సభ్యులతో కూడిన 20 రాపిడ్ రెస్పాన్స్ టీం లను ఏర్పాటు చేశామన్నారు.  వీరికి అవసరమైన పిపి కిట్లు, తదితరాలు సిద్ధం చేశామన్నారు.  అదేవిధంగా బర్డ్స్ ఫ్లూ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ప్రజలకు వివరించేలాగా అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు. అదే విధంగా 10 కిలోమీటర్ల పరిధిలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారికి యాంటీవైరస్ మందులు అందించేందుకు సిద్ధం చేశామన్నారు. ఇంతవరకు దేశంలో ఎక్కడా ఏఒక్క మనిషికి బర్డ్ ఫ్లూ సోకిందన్న దాఖలాలు లేవని ఆమె స్పష్టం చేశారు.  ఏలూరు జిల్లాలో వ్యక్తికి బర్డ్ ఫ్లూ నిర్దారణ అయింది అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, సరైన నిర్దారణ లేకుండా ఎవరైనా అసత్య ప్రచారాలతో ప్రజల్లో అలజడి సృష్టించవద్దని హితవు పలికారు. బాగా ఉడకపెట్టిన గుడ్లు, మాసంతో హానిలేదని ఇప్పటి వరకు మనుషులకు బర్డ్ ప్లూ వచ్చిన దాఖలాలు లేవన్నారు.  జిల్లాలో అటవీశాఖ అధికారులను కూడా అప్రమత్తం చేశామన్నారు.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola