అండమాన్ దీవుల్లో మరో అల్పపీడనం...డిసెంబర్ 3నాటికి బలపడే అవకాశం

వర్షాలతో ఇంకా కొలుకోని ఏపీకి మరో ముంపు ముంచుకోస్తోంది.మరో అల్పపీడనం ఏపీ వైపు దూసుకొస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

 బంగాళాఖాతంలో అండమాన్ దీవుల  మీదుగా దక్షిణ థాయ్‌లాండ్ సమీపంలో అల్పపీడనం ఏర్పడింది.ఇది వాయుగుండంగా బలపడనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబరు 3 నాటికి బలపడి తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తోంది.

అల్పపీడనం తుపానుగా మారి డిసెంబరు 4వ తేదీ వరకు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని.. ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబరు 2 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ కారణంగా కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను కారణంగా కోస్తాంధ్ర తీరం వెంట 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

తుపానుగా మారితే దానికి జవాద్ అని పేరు పెట్టాలని ఇప్పటికే.. సౌదీ అరేబియా ఆ పేరును సూచించింది. తుపాను ప్రభావంతో ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు వర్షం ముప్పుపొంచి ఉంది. అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.

మెున్న కురిసిన వర్షాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంకా కోలుకోలేదు. కొన్ని జిల్లాలు వర్షాలకు అతలాకుతలమయ్యాయి. ఆ దెబ్బ నుంచి కోలుకోకముందే మళ్లీ ఏపీ వైపునకు ముంపు ముంచుకొస్తుంది. మెున్నటి వర్షాలకు చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో తీవ్ర నష్టమైంది. వరదల కారణంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పుడు మరో ముప్పు ఏపీ వైపు వస్తుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola