CM Chandrababu Naidu Met Arudra | గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందిపడిన మహిళకు సీఎం భరోసా | ABP Desam
CM Chandrababu Naidu Met Arudra | కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెంనకు చెందిన ఆరుద్ర.. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఆరుద్ర కుమార్తె చంద్ర కు వెన్నులో కణితి ఏర్పడటంతో తీవ్ర అనారోగ్యం పాలయ్యిందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో బిడ్డ వైద్య ఖర్చుల కోసం తన ఆస్తులు అమ్ముకునే ప్రయత్నంలో గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందుల్ని ఆమె సీఎం చంద్రబాబుకు వివరించారు. దీంతో.. దివ్యాంగురాలైన ఆమె కుమార్తెకు 10వేల పింఛను మంజూరు చేస్తామని, వైద్య ఖర్చుల కోసం 5 లక్షలు సాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే... కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వ పరంగా ఎంత వరకు సాయం చేయవచ్చు అనేది కూడా పరిశీలించి అండగా ఉంటామని ముఖ్యమంత్రి తెలిపారు. సీఎం భరోసాపై ఆరుద్ర సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆరుద్ర మాట్లాడుతూ.. చంద్రబాబు గెలుపుతో తన కష్టాలు తీరిపోయినట్లు అనిపించిందని.. ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. సిఎం ఇచ్చిన భరోసాతో ఆరుద్ర సంతోషం వ్యక్తం చేశారు. గతంలో తన సమస్యను అప్పటి సిఎం దృష్టికి తీసుకెళ్లేందుకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ప్రయత్నించగా స్పందించలేదని ఆమె అన్నారు. పైగా ఎదురు కేసులు పెట్టి, వివాదాలు సృష్టించి తనను మానసిక హింసకు గురిచేశారని...పిచ్చిదాన్ని అనే ముద్ర వేశారని ఆరుద్ర కన్నీటిపర్యంతం అయ్యారు. ఆరుద్ర కష్టాలు విన్న ముఖ్యమంత్రి...ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటానని ఆమెకు హామీ ఇచ్చారు.