CM Chandrababu naidu Assembly Challenge | ఏపీ అసెంబ్లీలో శపథాన్ని నిరూపించుకున్న సీఎం చంద్రబాబు |ABP
Andhra Pradesh Assembly: చంద్రబాబు అన్న మాటను నిలబెట్టుకున్నారు. అయిదేళ్ల క్రితం 23 స్థానాలకే పరిమితమైన స్థాయి నుంచి.. అసెంబ్లీలో వ్యక్తిత్వ హననం, తన కుటుంబ సభ్యులకు జరిగిన అవమానం, అధికార పక్ష సభ్యుల వ్యక్తిగత ధూషణల నేపథ్యంలో ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ, తిరిగి ఈ సభకు ముఖ్యమంత్రిగానే వస్తానని సవాలు చేసిన చంద్రబాబు రెండున్నరేళ్లు తిరిగేసరికీ అన్నంత పనీ చేశారు. నిజానికి అంతకు మించే చేశారు. తనను, తన పార్టనీ తీవ్ర అవమానాలకు గురి చేసిన వైసీపీకి ప్రతిపక్ష హోదా సైతం లేకుండా చేసి తలెత్తెకుని అసెంబ్లీలో అడుగుపెట్టారు. చంద్రబాబుకు అసెంబ్లీలో ఎదురైన అవమానాలు చూసిన వారెవ్వరూ మళ్లీ ఆయన పుంజుకోగలుగుతారని ఊహించి ఉండరు.
45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబుకి మొదటి 40 ఏళ్లు ఒక ఎత్తయితే ఈ అయిదేళ్లు ఒకెత్తు. ఈ విషయం చంద్రబాబే స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు చెప్పారు. గతంలో ఆయన మహా మహా నాయకులను ఢీకొట్టారు. గెలుపోటములు రాజకీయాల్లో సహజం. గెలిచిన పార్టీ నాయకులు ఓడిన నాయకులను విమర్శించడం, ప్రతిపక్షం సైతం అధికార పక్షంపై రాజకీయ విమర్శలు చేయడం సహజం. కానీ జగన్ మార్కు కక్ష సాధింపు రాజకీయం మాత్రం ఆయన ఎదురు చూసింది కాదు. ఎన్నడూ లేనన్ని అవమానాలూ, కక్ష సాధింపులు ఎదుర్కొన్నారు. టీడీపీ నాయకుల ఆర్థిక మూలాల్ని దెబ్బతీశారు. ఆత్మస్థైర్యాన్ని నీరుగార్చారు. అక్రమ కేసులు బనాయించారు. భౌతిక దాడులు, హింస యథేచ్చగా సాగాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినా అప్పటి ప్రభుత్వం ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. ఏకంగా చంద్రబాబు ఇంటిపైనకు ఓ నేత మందీ మార్బలంతో దండెత్తినా చర్యల్లేవు.
జనసేన, భాజపాతో కలిసి 164 స్థానాలతో చరిత్రలో లేని విజయం సొంతం చేసుకుని, జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం లేకుండా చేసి సింహంలా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు చంద్రబాబు. అయితే తాను జైలులో ఉన్న సమయంలో తనకు జనసేన అధినేత పవన్ అండగా నిలిచిన తీరుని చంద్రబాబు మరువలేదు. ఇప్పటికీ చంద్రబాబు పలు సందర్భాల్లో పవన్ తనకు, పార్టీకి నైతిక స్థైర్యం ఇచ్చిన సంగతి పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన తరువాత సైతం ఆయనకు తన ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించారు. అంతే కాకుండా తన ఫొటోతో పాటు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ పవన్ ఫొటో కూడా ఉండాలని ఆదేశించి తన మనసులో పవన్ స్థానమేంటో చూపించారు.