AP Elections 2024 Counting | మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఫలితాల పండుగ | ABP Desam
ఓట్ల లెక్కింపునకు సమయం సమీపిస్తుండడంతో ఏపీలోని ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలతో గెలుపు తమదంటే కాదు తమదంటూ చెప్పుకుంటున్నా.. ఓటర్ మహాశయుడు ఎవరి వైపు మొగ్గుచూపారో అనే ఆందోళన లోలోన ఉంది. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రాల్లో బలంగా నిలిచే, పార్టీ విజయాన్ని డిసైడ్ చేసే వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించుకుంటున్నాయి. ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన ఉన్నవారిని, నిబంధనలపై పట్టున్న వ్యక్తులను ఎంపిక చేసి కౌంటింగ్ కేంద్రాల్లో అనుసరించాల్సిన విధానంపై రాజకీయ పార్టీలు శిక్షణ ఇస్తున్నాయి.కౌంటింగ్ హాళ్లలో ఘర్షణలకు దిగే అవకాశం ఉందని, ఉద్రిక్తత రేకెత్తించే ప్రణాళికలు ఉన్నాయంటూ టీడీపీ, వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తమ పార్టీ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయా పార్టీలు సూచిస్తున్నాయి. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం రికార్డు అవుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సంయమనం పాటించాలని ఆయా పార్టీల పెద్దలు సూచిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లు పదేపదే అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేసినా వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కౌంటింగ్ సూపర్‌వైజర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లదేనని, తమ పార్టీ ఏజెంట్లు అక్కడ జరుగుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.