Lorries Stuck Flood Water: కృష్ణా నది వరదలో చిక్కుకున్న 150 లారీలు... సమాచారం ఇవ్వలేదని డ్రైవర్లు ఆగ్రహం
పులిచింతల ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 75 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడిచిపెట్టారు. దీంతో కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద వరద నీరు పోటెత్తింది. వరద సమాచారం లేకపోవడంతో చెవిటికల్లు ఇసుక ర్యాంపులోకి వచ్చిన 150 పైగా లారీలు, జేసీబీలు, ట్రాక్టర్ లు నదిలో చిక్కుకున్నాయి. ముందస్తు సమాచారం లేకుండా నీటిని విడుదల చేశారనే డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.
ఇసుక కాంట్రాక్టు సంస్థకి వరద విషయం తెలిసినా తమకు సమాచారం ఇవ్వలేదని డ్రైవర్లు అంటున్నారు. తమకు, తమ లారీలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
నీరు తగ్గితే తప్ప లారీలు రావు
లారీలు నదిలో చిక్కుకున్న సమాచారంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద నీటిని విడుదల చేసేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టు గేట్లు మూసివేసి నీటిని నిలుపుదల చేశారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని వాహన యజమానులు, డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. నీరు తగ్గితే తప్ప లారీలు బయటకు తీసుకురావడం సాధ్యపడదని పోలీసులు అంటున్నారు. లారీ డ్రైవర్ లు ఒడ్డుకు చేరుకున్నారు.
సమాచారం లేదని ఆగ్రహం
రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక అధికారులు పడవల ద్వారా లారీ డ్రైవర్లు, క్లీనర్లను తీసుకువచ్చారు. ఇసుక కాంట్రాక్ట్ సంస్థ ప్రతిరోజూ వందలాది లారీలతో ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ కనీసం సరైన రోడ్డు మార్గం ఏర్పాటు చేయకపోవడంపై డ్రైవర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి నుంచి చెవిటికల్లు మీదుగా కృష్ణా నది క్వారీకి వచ్చే రోడ్డు అధ్వానంగా ఉంది. వరదలో చిక్కుకున్న లారీలు వరదకు దెబ్బతింటున్నాయని లారీ యజమానులు ఆవేదన చెందుతున్నారు.
Also Read: జయహో భారత్.. ఈ దేశభక్తి కోట్స్‌తో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి