Shocking Video : కొన్నిసార్లు ఫోన్ ధ్యాసలో పడిపోయి ముందు, వెనుక ఏముందో కూడా చూసుకోకుండా వెళ్లి ప్రమాదంలో పడుతూ ఉంటాం. డ్రైవింగ్ చేసేటప్పుడు, రద్దీగా ఉండే రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఫోన్ లో ఉండడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇప్పటికే అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అదే తరహాలో ఇప్పుడు ఓ సీసీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ మహిళ తన భుజంపై బిడ్డను ఎత్తుకుని ఫోన్లో ఎవరితోనో మాట్లాడుకుంటూ వెళ్తుండగా.. సడెన్ గా మ్యాన్ హోల్ లో పడిపోవడం కనిపించింది. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.

బిడ్డతో పాటు మ్యాన్ హోల్ లో పడ్డ మహిళ

ఆందోళనను రేకెత్తించే ఈ షాకింగ్ వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ మొబైల్ విలన్ గా మారితే.. అన్న క్యాప్షన్ తో షేర్ చేశారు. ఈ క్లిప్ లో మహిళ సల్వార్ సూట్ ధరించి, భుజంపై చిన్నారిని మోస్తూ మొబైల్ దుకాణం గుండా వెళ్తున్నట్టు చూడవచ్చు. ఆమె అలా రోడ్డు పక్కన ఉన్న బ్యానర్‌ను దాటగానే దారిలో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్ లో బిడ్డతో పాటు అకస్మాత్తుగా పడిపోయింది. ఫోన్‌లో బిజీగా ఉన్న ఆ మహిళ.. ప్రమాదాన్ని గమనించలేకపోయింది. అది గమనించిన స్థానికులు వెంటనే మ్యాన్‌హోల్ వద్దకు చేరుకుని, ఫైనల్ గా మహిళను, శిశువును బయటకు తీశారు. వారికి కొంచెం గాయాలైనట్టు సమాచారం. ఈ వీడియోపై సోషల్ మీడియాదారులు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ నిర్లక్ష్యంపై ప్రశ్నిస్తూ కామెంట్ చేశారు. మొబైల్ అనేది ఈ జనరేషన్ కు పెద్ద శాపమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. చిన్నారి తల మ్యాన్ హోల్ అంచుకు గట్టిగా తాకిందని, వారిద్దరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని ఇంకొకరు చెప్పారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. కానీ ప్రస్తుతానికైతై ట్రెండింగ్ లో ఉంది.

పాట్నాలోనూ ఇదే తరహా ఘటన

గతేడాది కూడా బీహార్‌లోని పాట్నాలో ఇదే తరహా ఘటన జరిగింది. మలియా మహాదేవ్ జల్లా రోడ్డులో ఓ మహిళ ఫోన్ మాట్లాడుతూ దాదాపు 8 అడుగుల లోతున్న మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. వెంటనే చుట్టుపక్కలవారు రంగంలోకి దిగి సకాలంలో మహిళను రక్షించారు. దీంతో ఆమెకు పెద్దగా గాయాలు కాలేదు. ఈ సంఘటన, అక్కడి సీసీటీవీలో కూడా రికార్డ్ అయింది.

Also Read : Viral : నాలుగు నెలల పాటు ఆన్ చేసే ఉంచిన గీజర్..కరెంట్ బిల్లు గురించి సోషల్ మీడియాలో రచ్చ