Cleverest Fox: గుంట నక్క, జిత్తుల మారి నక్క అని చిన్నప్పుడు కథలు చాలా మంది వినే ఉంటారు. ఇప్పటికీ నక్కల గురించి ఏదైనా కథ చెప్పాల్సి వస్తే గుంట నక్క అని, జిత్తుల మారి అంటూ సంబోధిస్తారు. ఇతర జంతువులను మోసం చేస్తుందనే చెబుతారు. జిత్తుల మారి తెలివితేటలు నాతో ట్రై చేయవద్దు అని అంటుంటారు. అయితే నక్కల్లో ఎన్నో మంచి గుణాలు, అలవర్చుకోవాల్సిన లక్షణాలు చాలానే ఉన్నాయి. అడవిలో జీవించే జంతువుల్లోకెల్లా నక్క అత్యంత తెలివైనది. తన బుద్ధితో అది తనకు హాని జరగకుండా, పెద్దగా కష్టపడకుండానే ఆహారం పొందుతూ, ఇతర జంతువుల బారిన పడకుండా హ్యాపీగా బతికేస్తుంది. నక్క ఎంతో తెలివైన జంతువు, అలాగే దేన్నైనా త్వరగా నేర్చుకుంటుంది. దాని ఇతర ప్రత్యేకతల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.
నక్క త్వరగా నేర్చుకుంటుంది
నక్కలు చాలా తెలివైనవి, చాలా చురుకైనవి. వాటికి ఎలా వేటాడాలో తెలుసు, వేట నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా తెలుసు. దాని నైపుణ్యాలతో పెద్ద పెద్ద జంతువుల నుంచి కూడా సులభంగా తప్పించుకు తిరుగుతుంది. పెద్దగా కష్టపడకుండానే ఆహారం పొందుతుంది. నక్కకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. అది దేన్నైనా చాలా త్వరగా నేర్చేసుకుంటుంది. నక్కలు సహజంగా పెద్ద జంతువుల జోలికి వెళ్లవు. చిన్న చిన్న ప్రాణులను వేటాడతాయి.
ఎక్కడైనా జీవిస్తుంది, హ్యాపీగా బతికేస్తుంది
నక్క సమస్యలు వస్తే వాటిని చాలా సులభంగా పరిష్కరించుకుని ఆపద నుంచి బయటపడుతుంది. చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అన్ని రకాల వాతావరణాల్లో బతకగలదు. అలాగే నక్కలు నక్కలను వేటాడుకోవు. ఇతర జంతువులు వేటాడిన ఆహారాన్ని తెలివిగా దొంగలిస్తుంది.
అద్భుతమైన వినికిడి, దృష్టి
నక్కలు అద్భుతమైన వినికిడి, దృష్టి, వాసన శక్తులను కలిగి ఉంటాయి. మనషులు వినలేని హై-పిచ్ శబ్దాలను కూడా నక్కలు వినగలవు. చీకట్లోనూ స్పష్టంగా చూడగలవు. కిలోమీటర్ల దూరంలో ఉన్న జంతువు మాంసం వాసనను కూడా గుర్తించగలవు.
నక్కను ఉండే మరికొన్ని ప్రత్యేకతలు
* నక్కలకు వాటి శరీరంతో పోలిస్తే మెదడు పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కూడా అధిక తెలివితేటలు నక్కల సొంతం.
* అద్భుతమైన ఇంద్రియ శక్తి నక్కల సొంతం. ఇవి పర్యావరణాన్ని అంచనా వేయగలవు. పరిస్థితులు అనుకూలించని చోట ఉండవు.
* నక్కలు సమస్యలను చాలా తెలివిగా, నైపుణ్యంతో పరిష్కరిస్తాయి. ఏవైనా పెద్ద జంతువులు వేటాడటానికి వస్తే సులభంగా తప్పించుకుంటాయి.
కుక్కలు, పిల్లుల్లా నక్కలు పెంపుడు జంతువులు కావు
నక్కలు పెంపుడు జంతువులు కావు. అంటే కుక్కలు, పిల్లుల్లా వాటిని పెంచుకోలేము. ఎందుకంటే ఇవి సహజంగానే చాలా దూకుడుగా ఉంటాయి. నక్కలు త్వరగా నేర్చుకుంటయి. కానీ వీటికి శిక్షణ ఇవ్వడం చాలా కష్టం. అలాగే నక్కలు తమ ప్రాంతానికి గుర్తులు పెట్టుకుంటాయి. మూత్రం, మలంతో వాటి భూభాగాన్ని గుర్తిస్తాయి. నక్క మలమూత్రాలు ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. ఇంట్లో నక్క మూత్ర విసర్జన చేస్తే ఆ వాసన పోగొట్టడం చాలా కష్టం. అలాగే నక్కలు సామాజిక జంతువులు కావు. ఇవి ఎప్పుడూ ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతాయి. కాబట్టి నక్కలను ఇంట్లో పెంచుకోవడం సాధ్యం కాదు. నక్కలు సహజంగానే ఒకే ప్రాంతంలో, ఒక సమూహంతో ఉండవు. నిత్యం సంచరిస్తూ ఉంటాయి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial