Viral Video: ఉన్నత చదువులు చదివి ఆ చదువులతో సంబంధం లేని వృత్తిలో స్థిరపడటం కొత్తమే కాదు. చాలా మంది చదివిన చదువులతో సంబంధం లేని దారిలో వెళ్లి విజయతీరాలకు చేరుతుంటారు. ఇక్కడ చదువు జ్ఞానాన్ని ఇస్తే, తమ ఆశలు, కోరికలకు తగ్గట్టుగా ఆ జ్ఞానాన్ని ఉపయోగించి తమ వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అలా ఉన్నత చదువులు పూర్తి చేసిన వారు, పెద్ద పెద్ద సంస్థల్లో ఉన్నతోద్యోగాలు చేసిన వారు వాటిని వదిలేసి చాయ్ సెంటర్లు, పానీ పూరీ బండ్లు ఏర్పాటు చేయడం వాటిని అద్భుతంగా నడిపించి వార్తల్లో నిలవడం చాలా సార్లు చూసే ఉంటాం. అలాంటిదే ఈ వార్త కూడా. ఓ వ్యక్తి ఉన్నత చదువులు చదివాడు. ఉన్నత కుటుంబంలో పుట్టి పెరిగాడు. లగ్జరీకి పేరొందిన ఆడీ కార్లలో తిరుగుతుంటాడు. కానీ ఇప్పుడు అదే లగ్జరీ కారును టీ కొట్టుగా మార్చేశాడు. అంత లగ్జరీ కారును అతడు టీ కొట్టుగా మార్చి వ్యాపారం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అసలు ఈ వీడియోలో ఏముందంటే..?
ముంబయికు చెందిన మన్ను శర్మ తన ఆడి కారు (Audi Car)ను టీకొట్టుగా మార్చేశాడు. లక్షలు విలువ చేసే ఆ కారు బ్యాక్ సైడ్ లోని టీ చేసేందుకు కావాల్సిన సామగ్రిని పెట్టుకొని మరీ పలు ప్రాంతాల్లో తిరుగుతాడు. తనకు నచ్చిన చోట, జనాలు కనిపించిన చోట కారును ఆపుతూ.. సామాన్లు బయటకు తీసి టీ తయారు చేస్తాడు. అనంతరం తన వద్దకు వచ్చే వారికి టీ విక్రయిస్తుంటాడు. అయితే తెల్లటి ఆడి కార్ లో స్టాల్ యజమాని మన్ను శర్మను మనం వీడియోలో చూడొచ్చు. "ఆన్ డ్రైవ్ టీ" అనే పేరుతో ముంబయిలోని లోఖండ్ వాలాలో టీ అమ్ముతుంటాడు. ఇతని కంపెనీ ట్యాగ్‌లైన్ "థింక్ లగ్జరీ, డ్రింక్ లగ్జరీ". ఈయన వద్ద టీ తాగేందుకు చాలా మందే ఆసక్తి కనబరుస్తున్నారు. కారులో కూర్చొని కూడా ఆయన చేసిన టీని తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఆ టీకి 100 రూపాయల వరకూ చెల్లించాల్సి ఉంటుంది.
ఆడి చాయ్ వాలాపై వెల్లువెత్తుతున్న కామెంట్లు
అయితే సోషల్ మీడియాలో ఇందుకు సంబందించిన వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున దీనిపై స్పందిస్తున్నారు. తమ మనసులోని భావాలను కామెంట్లు రూపంలో వైల్లడిస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు. కారు కొనడం వల్ల టీ అమ్ముతున్నాడా, టీ అమ్మేందుకు కారు కొన్నాడా అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. పని చేయడానికి నామూషీ అక్కర్లేదు.. నీకు నచ్చిన పని చేస్తున్నందుకు చాలా సంతోషం అంటూ మరో నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఏ వ్యాపారమూ చిన్న వ్యాపారం కాదు, శ్రమను గౌరవించండి అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ఇప్పటి వరకూ ఈ వీడియోనూ 88 వేల వ్యూస్ రాగా.. 8.6 వేల లైకులు వచ్చాయి.