Cleaning Jeans: జీన్స్.. చాలా మంది పురుషులకు ప్రియ నేస్తాలు. ఎందుకంటే.. ఒక్క జీన్స్ ఉతక్కుండా రెండు మూడు రోజులు, కొంత మంది అంతకంటే ఎక్కువే వేసుకుంటారు. ఫంక్షన్ అయినా, పార్టీ అయినా, మీటింగైనా, ఇంకేదైనా అయితే బ్లూ జీన్స్, లేదంటే బ్లాక్ జీన్స్ వేసుకుని పైన టీషర్టో, షర్టో వేసుకుంటే చాలు. స్టైలుకు స్టైల్, కంఫర్టుకు కంఫర్ట్. జీన్స్ ఇచ్చే కంఫర్ట్, స్టైలిష్ లుక్, మన్నిక.. ఈ కారణాల వల్ల జీన్స్‌ను కొనేందుకు చాలా మంది ఇష్టపడతారు. రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసినా ఒక్కో జీన్స్ చాలా కాలం పాటు వస్తుంది. అయితే జీన్స్‌ను ఎలా శుభ్రం చేసుకోవాలి. సంవత్సరానికి ఎన్ని సార్లు ఉతకాలి. జీన్స్ ను క్లీన్ చేసుకోవడానికి ప్రముఖ బ్రాండ్లు అయిన లెవి స్ట్రాస్, టామి హిల్‌ఫిగర్ హెడ్స్ ఏం చెబుతున్నారో ఓ లుక్కేద్దాం.


జీన్స్‌ను సంవత్సరానికి ఎన్ని సార్లు ఉతకాలి?


అవసరమైనప్పుడు మాత్రమే జీన్స్‌ను ఉతకాలి. వేసుకున్న ప్రతీసారి ఉతకాల్సిన అవసరం లేదు. జీన్స్ ఫ్యాబ్రిక్ అసలు ఉద్దేశమే అది. ప్రముఖ బ్రాండ్ల జీన్స్ ను సంవత్సరానికి కొన్ని సార్లు మాత్రమే ఉతకాలి. లెవీ స్ట్రాస్ సీఈవో, టామీ హిల్‌ఫిగర్ డిజైనర్ సహా చాలా మంది ప్రముఖ వ్యక్తులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. జీన్స్ ను సంవత్సరానికి కొన్ని సార్లు మాత్రమే ఉతకాలని సూచిస్తున్నారు. 6 నెలలకు ఒకసారి, మరీ అవసరం అయితే సంవత్సరానికి మూడుసార్లు జీన్స్ ను ఉతకాలని చెబుతున్నారు. ఇతర దుస్తులు అయినంత మురికిగా జీన్స్ అవ్వవని అంటున్నారు. 


ఖరీదైన డిజైనర్ జీన్స్ రా డెనిమ్ తో తయారు చేస్తారు. వాటిని ప్రీ వాష్ చేయరు. ఇండిగో డై సెట్ కూడా చేయరు. అందుకే వీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా ఉతక్కూడదని చెబుతున్నారు. ప్రీ వాష్ చేసి వచ్చే జీన్స్‌ను ఎలాగైన, ఎప్పుడైనా ఉతకవచ్చు. వీటిని కూడా వాటిని ధరించే వ్యక్తుల అలవాట్లను బట్టి ఉతకాలని సూచిస్తున్నారు నిపుణులు.


జీన్స్‌కు మరకలు పడితే ఎలా మరి?


జీన్స్‌పై మరకలు పడితే వాషింగ్ మెషీన్‌లో వేయడం లేదా ఇతర దుస్తుల్లాగే సర్ఫ్ లో నానబెట్టి మొత్తంగా ఉతికేయడం వల్ల జీన్స్ పాడవుతాయి. అందుకే ఎక్కడ మరక అంటుకుందో అక్కడ చల్లని నీటితో తడపాలి. ఆ తర్వాత ఐస్‌ తో రాయాలి. తర్వాత టూత్ బ్రష్ తో సున్నితంగా రాయడం వల్ల మరకలు తొలగిపోతాయి. తర్వాత వాటిని ఆరబెట్టుకోవాలి. రెండు మూడు రోజులు వేసుకున్న తర్వాత వాసన వస్తున్నట్లు అనిపిస్తే ఆరబెట్టుకుంటే సరిపోతుంది. డియోడరైజింగ్ ఫ్యాబ్రిక్ స్ప్రే వాడినా మంచి ఫలితం ఉంటుంది.


జీన్స్‌ను ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టాలి?


జీన్స్ ను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల దాని నాణ్యత దెబ్బతినదు. ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. ఉతక్కుండానే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. డెనిమ్ ధరించినప్పుడు చెమట వల్ల బ్యాక్టీరియా వస్తుంది. ఇది జీన్స్ కు అంటుకుని దుర్వాసన కలిగిస్తుంది. అందుకే జీన్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఈ బ్యాక్టీరియా నశిస్తుంది. కాన్వాస్ క్లాత్ బ్యాగ్ లో జీన్స్ ఉంచి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తర్వాత వాటిని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా తొలగిపోతుంది.


జీన్స్‌ను ఎలా ఉతకాలి?


జీన్స్ ను ఉతకడానికి ముందు వాటిని రివర్స్ చేయాలి. లోపలి భాగం బయటకు, బయటి భాగం లోపలి వైపు ఉండేలా చేయాలి. తర్వాత వాటిని చల్లటి నీటిలో సున్నితమైన సర్ఫ్ వేసి అందులో జీన్స్ ను 3, 4 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని బయటకు తీసి వేరే నీటిలో ముంచుకోవాలి. ఇలా రెండు మూడు సార్లు చేశాక నీటిని తొలగించకుండానే అలాగే ఆరబెట్టుకోవాలి. వాషింగ్ మెషీన్ వాడుతుంటే.. అందులో కూడా చల్లని నీటిలో పోసుకోవాలి. చల్లటి నీరు మరకలు, దుమ్ము ధూళిని తొలగిస్తుంది. వేడి నీరు మరకలు ఫ్యాబ్రిక్‌కు పట్టుకునేలా చేస్తుంది. కాబట్టి చల్లటి నీటి వాడుకోవాలి. బ్లీచ్ లేని డిటర్జెంట్లనే వాడాలి.