Elephant Crocodile Fight: గజేంద్ర మోక్షం కథ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సరస్సులోకి దిగిన ఏనుగు కాలిని ఓ మొసలి పట్టుకుని నీటిలోకి లాగుతుంది. మొసలి పట్టు నుండి విడిపించుకోలేక ఆ ఏనుగు మహావిష్ణువును ప్రార్థించగా.. విష్ణువు వచ్చి ఆ మొసలి బారి నుండి గజేంద్రుడిని కాపాడతాడు. ఈ ఇతిహాసంలో ఆ ఏనుగు పేరు గజేంద్రుడు కావడం, గజేంద్రుడికి మహావిష్ణువు విడిపించడం వల్ల ఆ కథను గజేంద్ర మోక్షంగా ప్రసిద్ధి చెందింది. అలాంటి పరిస్థితే తాజాగా ఓ మొసలికి ఎదురైంది. చిన్న నీటి గుంట కనిపించగానే ఆ ఏనుగు మైమరిచిపోయి అందులో జలకాలాటలు ఆడుకుంది. అటు ఇటు దొర్లుతూ ఎండ వేడి నుండి చల్లగా ఎంజాయ్ చేసింది. అంతలోనే ఓ మొసలి ఆ ఏనుగుపై దాడి చేసేందుకు పైకి వచ్చింది. అయితే ఆ ఏనుగు తనను కాపాడాలంటూ ఎవరినీ పిలవలేదు. తనకు పిలిచే అవసరం కూడా లేదు. ఎందుకంటే తనతో మహావిష్ణువు అంతటి తల్లి అండగా ఉంది. తల్లి అండగా ఉంటే ఏ జీవి అయినా ఎందుకు భయపడుతుంది.
తల్లి ప్రేమ, మమకారం, భద్రత మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా ఒకటే. మరీ ముఖ్యంగా ఏనుగులు తమ పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటాయి. ఏనుగులు ఎంత ప్రశాంతంగా ఉంటాయో.. తన పిల్లలకు ఆపద వస్తే అంతకంటే ఎక్కువ ఉక్రోశంతో, ఆవేశంతో కనిపిస్తాయి. ఎంతటి జంతువునైనా ఎక్కడైనా ఎదురిస్తాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో గున్న ఏనుగు నీటిలో ఆడుకుంటుండగా.. దానిపై దాడి చేసేందుకు నీటిలో నుండి మొసలి బయటకు వస్తుంది. నీటి ఒడ్డునే ఉండి బుజ్జి ఏనుగు ఆడుకుంటుండాన్ని గమనిస్తున్న ఆ తల్లి ఏనుగు మొసలి అలికిడి వినిపించగానే ఒక్క ఉదుటున ఆ మొసలిపైకి దూకింది. తన కాళ్లతో తొక్కేసింది. తొండంతో పట్టుకునేందుకు ప్రయత్నించింది. నా బిడ్డపైనే దాడికి వస్తావా అనుకుంటూ ఘీంకరిస్తూ తన కోపాన్ని ఆ మొసలిపై చూపించింది. ఆ తల్లి ఏనుగు దాడితో కన్ను లొట్ట పడి ఆ మొసలి కుయ్యో మొర్రో అనుకుంటా అక్కడి నుండి తప్పించుకుని పారిపోయింది.
బుజ్జి ఏనుగులను పెద్ద ఏనుగులు ఎలా రక్షించుకుంటాయి?
సుశాంత నందా అనే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశాడు. ' ఏనుగులు తన గున్న ఏనుగులను రక్షించుకునేందుకు ఏం చేస్తాయి, ఎంత వరకు వెళ్తాయని తెలుసుకునేందుకు ఇదో చిన్న సంఘటన. తల్లి ప్రేమ ముందు మొసలి లొంగిపోయింది' అంటూ రాసుకొచ్చాడు ఆ ఆఫీసర్. ఈ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. అమ్మ ఎప్పటికీ అమ్మే. అది మనిషి అయినా జంతువు అయినా ప్రేమలో మాత్రం ఎలాంటి తేడా ఉండదంటూ ఓ ట్విట్టర్ యూజర్ కామెంట్ పెట్టాడు. గ్రేట్ మమ్మీ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఓ తల్లి తన పిల్లను కాపాడుకోవడంలో విజయవంతమైందని మరొకరు కామెంట్ చేశారు.