ష్యా-ఉక్రేయిన్‌ల మధ్య పోరు ఇంకా కొనసాగుతోంది. ఉక్రేయిన్ దురాక్రమణకు రష్యా సైనికులు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఉక్రేయిన్ బలగాలు, ప్రజలు ఏ మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటూ పోరాడుతున్నారు. రష్యా సైనికులు కనిపిస్తే చాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్న ఉక్రేయిన్ ప్రజలు.. తమ పరిసరాల్లోకి వస్తే చాలు తన్ని తరిమేస్తున్నారు. సైన్యం వద్ద ఉన్న ఆయుధాలకు సైతం భయపడటం లేదు. రష్యా సైన్యం వారిని బెదిరిస్తున్న సరే భయపడకుండా తగిన సమాధానం చెబుతున్నారు. తాజాగా ఓ వృద్ధ జంట తమ నివాస ప్రాంగణంలోకి అడుగుపెట్టిన రష్యా సైనికులను తరిమేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఉక్రేయిన్‌లోకి చొచ్చుకెళ్లిన రష్యా సైన్యం ఆహార, పానీయాలు లభించక అల్లాడుతున్నారు. దీంతో ఖాళీగా ఉంటున్న ఇళ్లలోకి వెళ్లి ఆహారం కోసం వెతుకుతున్నారు. ఈ వీడియోలో ఉన్న ముగ్గురు సైనికులు కూడా ఆహారం కోసం సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లారు. ఆ ఇల్లు ఖాళీగా ఉందని భావించారు. వారు లోపలికి వెళ్లగానే ఓ వృద్ధ జంట బయటకు వచ్చారు. ‘‘మా ఆవరణలోకి రావడానికి మీకెంత ధైర్యం? వెంటనే బయటకు పొండి’’ అంటూ ఆ దంపతులిద్దరూ ఆ ముగ్గురు సైనికులను బయటకు పంపేశారు. వారు గన్స్ చూపిస్తున్నా సరే, లోపలికి అనుమతించలేదు. ఇక చేసేదేమీలేక వారు బయటకు వెళ్లిపోయారు. ఇదంతా వారి సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. 






తాజాగా ఓ ఉక్రేయిన్(Ukraine) మహిళ బాల్కానీలో కూర్చొని రష్యాకు చెందిన డ్రోన్‌పై టమోటాలతో దాడి చేసి కూల్చేసింది. ఈ విషయాన్ని ఉక్రేయిన్ ప్రభుత్వ సలహాదారుడే స్వయంగా ప్రకటించడం విశేషం. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఉక్రేయిన్ మహిళ దోసకాయలతో డ్రోన్‌ను కూల్చేసింది’’ అని చెప్పారు. ఈ నేపథ్యంలో Liga.net అనే వార్త సంస్థ కీవ్‌లో నివసిస్తున్న ఆ మహిళను కలిసి వివరాలు సేకరించింది. 


ఈ సందర్భంగా ఆమె తన పేరు ఒలెనా అని చెప్పింది. తాను డ్రోన్‌ను కూల్చేసిన సంగతి నిజమేనని, ప్రభుత్వ ప్రకటనలో చిన్న పొరపాటు ఉందని తెలిపింది. ‘‘నేను డ్రోన్‌ను కూల్చింది టమోటాలతో, మధ్యలో ఈ దోసకాయలు ఎక్కడి నుంచి వచ్చాయో’’ అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘‘ఆ రోజు నేను కివ్‌లోని నా అపార్ట్‌మెంట్ బాల్కానీలో కూర్చొని స్మోకింగ్ చేస్తున్నా. ఆ సమయంలో శబ్దం చేసుకుంటూ ఏదో ఎగురుతూ అపార్ట్‌మెంట్ మీదకు వచ్చినట్లు అనిపించింది. అది రష్యా సైనికుల డ్రోన్ అని తెలియగానే కంగారు పడ్డాను. దగ్గర్లో ఉన్న వస్తువులు దానిపైకి విసరాలని అనుకున్నా. ఆ సమయంలో అక్కడ టమోటాలు (Tomatoes) ఉన్నాయి. అంతే, ఆలస్యం చేయకుండా టమోటాలను డ్రోన్ మీదకు గురిచేసి కొట్టాను. అంతే దెబ్బకు డ్రోన్ అదుపుతప్పి కిందపడి ముక్కలైంది’’ అని తెలిపింది. 


Also Read: టాయిలెట్‌లో పుతిన్ ఫొటో, మూత్రం పోస్తూ ప్రతీకారం, రష్యాపై ఇదేం రివేంజ్‌రా అయ్యా!


‘‘ఇదంతా నేను భయంతోనే చేశాను. ఆ డ్రోన్ నన్ను షూట్ చేస్తుందేమోనని భయపడ్డాను. బాంబులు వదులుతుందేమోనని కంగారు పడ్డాను. అందుకే, అప్పటికప్పుడు దానిపై దాడి చేశాను. ఆ డ్రోన్ కిందపడిన వెంటనే నేను, నా భర్త అక్కడికి దాన్ని ముక్కలుగా ముక్కలు చేసేశాం. ఆ తర్వాత వాటిని వేర్వేరు చెత్త బుట్టల్లో వేశాం. నాకు ఎలక్ట్రానిక్ వస్తువుల గురించి పెద్దగా తెలీదు. అవి నేను ఉండే లొకేషన్‌ను గుర్తుపడతాయనే భయం కూడా ఉంది’’ అని తెలిపింది. అయితే, ఆమె కూల్చేసినది బాంబులు వేసే డ్రోన్ కాదని, డ్రోన్ కెమేరా అని తెలిసింది. రష్యాదు దాడులకు భయపడేది లేదని ఒలెనా తెలిపింది. తమ నేలను, నగరాన్ని ఎందుకు వీడాలని, చివరికి వరకు పోరాడతామే గానీ, పారిపోమని ఆమె పేర్కొంది.