Drunkards Loot Seized Liquor In Guntur: రహదారిపై భారీగా మద్యం సీసాలను పెట్టి ధ్వంసం చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అది చూస్తూ మందుబాబులు ఆగలేకపోయారు. 'సారీ సార్ మేం ఆగలేం' అంటూ ఏకంగా పోలీసుల సమక్షంలోనే మద్యం బాటిళ్లు తీసుకుని ఉడాయించారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లావ్యాప్తంగా (Guntur District) రూ.50 లక్షల విలువైన 24,031 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సోమవారం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నల్లచెరువులోని డంపింగ్ యార్డులో ధ్వంసం చేయడం ప్రారంభించారు. అయితే, యార్డు పరిసరాల్లోని మందుబాబులు ఈ దృశ్యాలను చూసి తట్టుకోలేకపోయారు.
సాధారణంగా పోలీసులు ఇలాంటి సందర్భాల్లో రోడ్డు రోలర్‌తో మద్యం సీసాలను ధ్వంసం చేస్తారు. అయితే, ఈసారి పొక్లెయిన్‌తో సీసాలను ధ్వంసం చేసేందుకు యత్నించగా.. అవి పగలగొట్టేందుకు సమయం పట్టింది. మందు బాటిళ్లను ధ్వంసం చేయడం ప్రారంభించిన కొద్దిసేపటికే ఉన్నతాధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే అదనుగా భావించిన మందుబాబులు ఒక్కసారిగా గుంపులుగా అక్కడికి చేరుకుని మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. పోలీసులు అడ్డుకునేందుకు యత్నించినా.. వారి ముందే సీసాలను ఎత్తుకెళ్లారు. వారిని నిలువరించడం పోలీసులకు కష్ట సాధ్యమైంది.