YS Sharmila: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి మరోసారి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో షర్మిల సోమ, మంగళవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సారి పర్యటనలో కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనానికి సంబంధించి పూర్తిస్థాయి స్పష్టత రానుందని వైఎస్సార్‌టీపీ వర్గాలు తెలిపాయి. పార్టీ విలీనం యత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ విలీనానికి సెప్టెంబరు 30ని డెడ్‌లైన్‌గా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పలు ప్రయత్నాలు జరిగాయి.  


ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు పావులు కదిపినట్లు సమాచారం. షర్మిలతో సంప్రదింపులు జరిపారని, పార్టీ అధిష్ఠానం పెద్దలతోనూ మాట్లాడించినట్లు తెలుస్తోంది. షర్మిల విలీనంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం కలుగుతుందని అధిష్టానానికి వివరించినట్లు తెలుస్తోంది. ఈ నేపపథ్యంలోనే షర్మిలను ఢిల్లీకి రావాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించినట్లు సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనానికి స్థూలంగా అంగీకారం కుదిరిందని, తెలంగాణ స్థానికతే షర్మిల కోరుతుండడం మొత్తం ప్రక్రియలో చిక్కుముడిగా మారిందనే వాదన వినిపిస్తోంది. 


తాను పాలేరు నుంచి పోటీ చేస్తానంటూ అధిష్ఠానం ముందు ఆమె ప్రతిపాదించారు. అయితే షర్మిల సేవలను ఏపీలోనే వాడుకోవాలని, తెలంగాణ కాంగ్రెస్‌ నుంచి వద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆయన వర్గం నేతలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అలాగే షర్మిల కూడా ఒక మెట్టు దిగి పాలేరు నుంచి పోటీ ప్రతిపాదనను విరమించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం సీటు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆమె చేసే అవకాశం ఉన్నట్లు వైఎస్సార్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి.


కాంగ్రెస్ లో తన పార్టీ విలీనంపై ఈనెల 30వ తేదీలోగా ఏ విషయం ప్రకటించాలని షర్మిల డెడ్ లైన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై షర్మిల కూడా బెంగుళూరుకు వెళ్లి కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో చర్చలు కూడా జరిపారు. తర్వాత ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కూడా భేటీ అయ్యారు. విలీనానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ అయిపోయాయి ఇక విలీనం ప్రకటన చేయటం ఒక్కటే మిగిలిందనే అంతా అనుకున్నారు.


అయితే తెరవెనుక ఏం జరిగిందో కానీ ఎప్పటికప్పుడు విలీనం ప్రకటన వాయిదాలు పడుతునే ఉంది. చివరకు ఇపుడు విలీనమే అనుమానంగా మారిపోయింది. షర్మిల వల్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ఆమె చేరిక వల్ల బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ ను మరోసారి రెచ్చగొట్టే అవకాశం ఉందని అందుకే చేర్చుకోవద్దని హైకమాండ్‌కు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేతలు తేల్చిచెప్పేశారు. చివరికి కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు అటు ఓకే కానీ టు నో అని కానీ చెప్పలేదు. అలా నాన్చడంతో షర్మిల తదుపరి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నదానిపై నిర్ణయం తీసుకోలేకపోయారు. అయితే తాజాగా గడవు ముగియడంతో షర్మిలకు కాంగ్రెస్ నుంచి పిలుపు వచ్చింది.