Shankar Arrest: హైదరాబాద్ లో మరో యూట్యూబర్ ను పోలీసులు అరెస్టు చేశారు. న్యూస్ లైన్ పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహించే శంకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. భర్తతో విడిపోయిన ఓ మహిళ తనను పెళ్లి చేసుకంటానని నమ్మించి అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత పలుమార్లు శారీరకంగా కలిశామని .. అయితే పెళ్లి చేసుకోమని అడిగే సరికి ముఖం చాటేశాడనన్నారు. తాను విషయం బయట పెడతానని చెబితే.. తన ట్విట్టర్ అకౌంట్ ను పోలి ఉండే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తనపై తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నారని ఆ మహిళ తెలిపారు. మహిళ అంబర్ పేటలో ఫిర్యాదు చేయడంతో అక్కడి పోలీసులు తుర్కయాంజల్‌లోని శంకర్ నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.
యూట్యూబర్ శంకర్ ను అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు ఆయన పలు కారణాలతో ఆలస్యం చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు హెచ్చరించారు. బ్రష్ చేసుకోవడానికి రెడీ అవడానికి అంటూ ఆయన రెండు, మూడు గంటల పాటు పోలీసుల్ని నిరీక్షించేలా చేశారు. చివరికి పోలీసులు కారులో బలవంతంగా ఎక్కించాల్సి వచ్చింది.
యూట్యూబర్ శంకర్ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర పదజాలంతో పోస్టులు పెడుతూ ఉంటారు. అందుకే యూట్యూబర్ శంకర్ ను పోలీసులు అరెస్టు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రశ్నించినందుకే అరెస్టు చేశారని వియ్ స్టాండ్ వింత్ శంకర్ అని సపోర్టు చేస్తున్నారు.
అయితే శంకర్ ను సోషల్ మీడియా పోస్టుల కేసులో కాకుండా ఓ మహిళ ఫిర్యాదుతో అరెస్టు చేశారు. అయినా తప్పుడు ఫిర్యాదులతో అరెస్టు చేయించారని ఆరోపిస్తున్నారు.
అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం జర్నలిస్టునని నీతులు చెబుతూ ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.