Continues below advertisement

Madhy Yaski :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు టిక్కెట్ టెన్షన్ పెద్దగా లేదు. కానీ తమకంటూ ప్రత్యేకమైన నియోజకవర్గం లేని మధుయాష్కీ వంటి వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకూ నిజామాబాద్ ఎంపీగా మాత్రమే పోటీ చేసిన మధుయాష్కీ ఈ సారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నారు.కానీ నిజామాబాద్‌లో కాకుండా హైదరాబాద్ శివారులో ఉన్న ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడ టిక్కెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. హైకమాండ్ వద్ద ఆయనకు మంచి పలుకుబడి ఉండటంతో టిక్కెట్ వచ్చేస్తుందని అనుకుంటున్నారు.కానీ ఆయనకు ఎల్బీనగర్ నేతల నుంచి సెగ ఎదురవుతోంది. 

ఎల్బీనగర్ పై మధుయాష్కీ ఆశలు 

Continues below advertisement

ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో దిగేందుకు మధుయాష్కి గౌడ్ దరఖాస్తు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. ఇక్కడి నుండి పోటీ చేసేందుకు పార్టీ సీనియర్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మల్ రెడ్డి రాంరెడ్డిలు సంవత్సరాలుగా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. టీపీసీసీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు చేపడుగూ నిత్యం ప్రజల మద్య ఉంటూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ తాను స్థానికుడినే అంటూ ఎల్బీ నగర్ నుండి పోటీ చేసేందుకు ముందుకు రావడంతో సెగ్మెంట్ కాంగ్రెస్ నాయకులలో ఆందోళన మొదలైంది.    ఆయన రాకను వ్యతిరేకిస్తున్న వారు ఏకంగా గాంధీభవన్ లోనే ఆయనకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వేశారు. దీంతో ఎల్బీ నగర్ నుండి పోటీ ఆయన పోటీ చేసి విజయం సాధించడం అంత సులువు కాదనేది స్పష్టం కాగా గ్రూపు తగాదాలు బహిర్గతమయ్యాయి .అయితే ఇదంతా కుట్ర ప్రకారం చేస్తున్నారని ఎల్బీ నగర్‌లో తానే పోటీ చేస్తానని ఆయన అంటున్నారు. 

మధుయాష్కీకి వద్దంటున్న  నేతలు

ఎల్బీ నగర్ నియోజకవర్గం మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మల్ రెడ్డి రాంరెడ్డి, మరో సీనియర్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డిలు మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ అభ్యర్ధిత్వాన్ని పక్కకు పెట్టాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. నియోజకవర్గంలో మొదటి నుండి పని చేస్తున్న తమను కాదని బయటి వ్యక్తులకు టికెట్ ఇస్తే పార్టీ గెలవదని చెబుతున్నారు.  నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులలో ఎవరికి టికెట్ ఇచ్చినా పని చేస్తామని, బయటి నాయకులకు టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితులలో సహకరించబోమని పార్టీ రాష్ట్ర నాయకత్వంతో ఖరాఖండిగా చెప్పినట్లుగా తెలిసింది .దీంతో ఎల్బీ నగర్ నుండి టికెట్ ఆశిస్తున్న నేతలందరినీ ఢిల్లీకి పిలింపించగా టికెట్ ఆశిస్తున్న వారంతా ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేయడంతో ఎల్బీ నగర్ కాంగ్రెస్ టికెట్ ఎవరిని వరిస్తుందోననేది చర్చనీయాంశంగా మారింది .

చంద్రబాబు అరెస్టును ఖండించడానికి కారణం ఎల్పీనగరే టిక్కెట్టేనా ?

ఎల్బీనగర్ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతి పరులు ఎక్కువగా ఉంటారు. అందుకే.. మధుయాష్కీ ఇటీవల చంద్రబాబు అరెస్టును ఖండించారు. కేసీఆర్, మోదీ కలిసి అరెస్టు చేయించారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. అక్కడి ఓటర్లను ఆకట్టుకోవడానికే పోటీ పడి ఇలా చేస్తున్నారని అంటున్నారు. మధుయాష్కీ కి టిక్కెట్ తెచ్చుకోవడం కష్టం కాకపోయినా అందర్నీ కలుపుకుని వెళ్లడం మాత్రం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది.