Kishan Reddy About Resignation: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారని ప్రచారంపై ఆయన స్పందించారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ నాయకత్వం , రాష్ట్ర నాయకత్వంలో సమన్వయం చేసుకుంటూ వెళ్తామని, అధికారిక ప్రకటనలు నమ్మాలని వదంతులను నమ్మకూడదని సూచించారు. కేంద్రమంత్రిగా ఉన్న ఆయన కేబినెట్‌ మీటింగ్‌ కు హాజరుకాకపోవడంతో పదవికి రాజీనామా చేయడం వల్లే గైర్హాజరు అయ్యారని ప్రచారం జరిగింది. అయితే కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ వరకు తాను కేంద్ర మంత్రిగా కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. నేటి సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తానని తెలిపారు. నగరానికి వచ్చాక రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అయి పలు విషయాలపై చర్చించనున్నట్లు చెప్పారు.


ఈరోజు వరకు తాను పార్టీని ఏదీ కావాలని కోరలేదని కిషన్ రెడ్డి తెలిపారు. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర బీజేపీ తొలి అధ్యక్షుడిగా చేసినట్లు గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైతం 2 పర్యాయాలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించానన్నారు. పార్టీ ఆదేశిస్తే, ఏ పని చేయడానికైనా తాను సిద్ధమేనని పేర్కొన్నారు. వరంగల్ లో ప్రధాని నరేంద్ర మోదీ సభ విజయవంతం చేసేందుకు పార్టీ నేతలం ఫోకస్ చేశామన్నారు.


తెలంగాణ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు ఎప్పుడంటే..
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం తనను నియమించాక తొలిసారి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయలేదన్న ఆయన, అధిష్టానం ఏ నిర్ణయంతీసుకున్నా స్వాగతిస్తా అన్నారు. జులై 8న వరంగల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సభ ఉంటుందని, ఆ తర్వాత బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ నేపథ్యంలో నేడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు. రాత్రికి రాష్ట్ర పార్టీ నేతలతో కీలకంగా భేటీ కానున్నారు. జులై 6న ఉదయం వరంగల్ కు వెళ్లనున్నట్లు తెలిపారు. ఎనిమిదో తేదీ వరకు వరంగల్ లోనే ఉండి సభ ఏర్పాట్లు, ప్రజా సమీకరణ, నేతలతో ప్రస్తుత పరిస్థితులపై చర్చించి కేంద్రానికి వివరించనున్నారని తెలుస్తోంది.


వాస్తవానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి పదవిపై కిషన్ రెడ్డి ఆసక్తి చూపలేదు. తనకు ఆ పదవి కావాలని పార్టీ అధిష్టానాన్ని సైతం అడగలేదు. కానీ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బలోపేతం రావడం, వీలైతే అధికారంలోకి రావాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. అదే సమయంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నాయకత్వంపై పార్టీలోనూ అసమ్మతి రాజుకుంది. కొన్ని సందర్భాలలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ సైతం తన సొంత అభిప్రాయాలను చెప్పేవారు. ఈటల రాజేందర్ వర్గీయులు ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని, ఎందుకంటే సీఎం కేసీఆర్ లోపాలు చాలా తెలుసున్నారు. కేసీఆర్ ఆలోచనల్ని అర్థం చేసుకుని ఎత్తుకు పై ఎత్తులు వేయాలంటే ఈటల సరైనవాడని అనుకున్నారు. బీజేపీ హైకమాండ్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించింది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial