Will Election Commission approve TRS name: తెలంగాణ ప్రజల గుండెల్లో బలంగా నాటుకుపోయిన టీఆర్ఎస్ అనే పేరు ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసే అంశంగా మారుతోంది. జాతీయ రాజకీయాల కోసం కేసీఆర్ తన పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చినా క్షేత్రస్థాయిలో తెలంగాణ అనే పదం లేకపోవడం ఒక లోటుగా మిగిలిపోయింది. అదే అవకాశంగా కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ ప్రకటన చేశారు.
పార్టీ పేరును ఈసీ ఆమోదించదని బీఆర్ఎస్ నేతల ఆశ
కవితపార్టీ పేరును ఎన్నికల సంఘం ఆమోదించదని బీఆర్ఎస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. అసలుకు..నకిలీకి చాలా తేడా ఉంటుందని బీఆర్ఎస్ సెటైర్లు వేస్తోంది. ఆ పార్టీ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్ పేరును ఈసీ ఆమోదించదు కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందాల్సినపనిలేదని అంటున్నారు.
సాంకేతిక ఖాళీ.. ఈసీ నిర్ణయం ఎలా ఉంటుంది? భారత ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం, ఒకసారి ఒక పార్టీ తన పేరును అధికారికంగా మార్చుకున్నప్పుడు, పాత పేరు ఫ్రీ పూల్ లోకి వెళ్తుంది. అంటే సాంకేతికంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు ప్రస్తుతం ఖాళీగానే ఉంది. అయితే, ఎన్నికల గుర్తుల రూల్స్ ప్రకారం, ఓటర్లను తప్పుదోవ పట్టించేలా ఉన్న పేర్లను కేటాయించకూడదని ఈసీకి విచక్షణాధికారం ఉంటుంది. దశాబ్దాల చరిత్ర ఉన్న టీఆర్ఎస్ పేరును వేరొకరికి ఇవ్వడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ గట్టిగా వాదించవచ్చు. కానీ ఇక్కడ కవిత నేరుగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు పెట్టలేదు. తెలివిగా.. తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టారు. షార్ట్ కట్ పేర్లను ఈసీ పెద్దగా పట్టించుకోకపోవచ్చు.
కవితకు పార్టీ పేరు అందకుండా కేసీఆర్ న్యాయపోరాటం ఖాయం
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ప్రజలు టీఆర్ఎస్ ను తమ సొంత ఇంటి పార్టీగా భావించారు. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత, ఆ పార్టీకి ఉన్న ప్రాంతీయ బ్రాండ్ ఇమేజ్ కొంత మసకబారిందనేది కాదనలేని వాస్తవం. అందుకే టీఆర్ఎస్ పేరు కోసం కవిత ఈసీకి దరఖాస్తు చేసినప్పుడు, బీఆర్ఎస్ కచ్చితంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఈసీ అనుమతిస్తే ఢిల్లీ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం ఉంది. అయితే, ఈ న్యాయపోరాటం ఫలితం ఎలా ఉన్నా, ఆ ప్రక్రియలో జరిగే చర్చ ప్రజల్లోకి నెగటివ్ సంకేతాలను పంపుతుంది. తమ పాత పేరును కూడా కాపాడుకోలేకపోతున్నారా " అనే భావన ప్రజల్లో కలిగితే అది పార్టీ నైతిక బలాన్ని తగ్గిస్తుంది. బీఆర్ఎస్ ఈ చర్చను కొనసాగించాలా లేదా అన్నది వారు ఖరారు చేసుకునే వ్యూహాలను బట్టి ఉంటుంది. పేరు వెనుక ఉన్న పవర్ పాలిటిక్స్
రాజకీయాల్లో గుర్తు కంటే పేరు కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ముఖ్యంగా ప్రాంతీయ ఆకాంక్షలతో ముడిపడినప్పుడు. అందుకే బీఆర్ఎస్ ఇప్పుడు ఇరకాటంలో పడటం ఖాయం . టీఆర్ఎస్ అనేది కేవలం మూడు అక్షరాలు మాత్రమే కాదు.. అది తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పగల ఒక శక్తివంతమైన ఆయుధం. టీఆర్ఎస్ పేరు తిరిగి తెరపైకి రావడం అదీ కూడా కవిత వైపు నుంచి రావడం బీఆర్ఎస్‌కు అతిపెద్ద రాజకీయ ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. సాంకేతికత కంటే రాజకీయ సెంటిమెంటే ఇక్కడ కీలక పాత్ర పోషించనుంది.
